ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఆటగాళ్ళ ఫామ్ , ఫిట్ నెస్ తో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకుని కొనుగోళ్ళు చేశాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ ప్లేయర్స్ కు షాక్ ఇచ్చాయి. కాగా మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. దీనిలో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే గత సీజన్‌లో తృటిలో టైటిల్‌ను చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏడుగురు విదేశీ ప్లేయర్లతో సహా 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టును ఎంపిక చేసుకుంది. వేలంలో కావ్యా మారన్ మార్క్ స్ట్రాటజీ బాగా కనిపించింది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీకీ గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌ను సొంతం చేసుకోలేకపోయింది. కానీ వాళ్ల స్థానంలో మహ్మద్ షమి, హర్షల్ పటేల్‌ను దక్కించుకుంది. గత సీజన్‌లో ఫైనల్స్‌కు చేరడానికి ప్రధాన కారణంగా నిలిచిన బ్యాటర్లపైనా ఫోకస్ పెట్టింది.
విధ్వంసక బ్యాటర్-వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్‌లో విఫలమైన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను దక్కించుకుంది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్‌లతో పాటు ఇషాన్ కిషన్, అభినవ్‌లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తోంది. వీళ్లతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మ వంటి యంగ్ ప్లేయర్స్ కూడా జట్టులోకి వచ్చారు. గత సీజన్ అనుభవాలతో అప్పటి లోపాలపైనా కావ్యా పాప దృష్టి పెట్టింది. ఈ క్రమంలో స్పెషలిస్ట్ స్పిన్నర్లను సన్‌రైజర్స్ దక్కించుకుంది. వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువగా దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను వేలంలో కొనుగోలు చేసింది.
ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లను దక్కించుకుంది. కామిందు మెండిస్, బ్రిడన్ కార్స్, ఇషాన్ మలింగలను తక్కువ ధరకే సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో జట్టును మరింత పటిష్టం మార్చింది. ఓవరాల్ గా వేలంలోకి 45 కోట్లతో అడుగుపెట్టిన సన్ రైజర్స్ 15 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది. వీరి కోసం 44 కోట్ల 80 లక్షలు వెచ్చించగా… ప్రస్తుతం సన్ రైజర్స్ మనీ పర్స్ లో 20 లక్షలే మిగిలాయి. వేలానికి ముందే సన్ రైజర్స్ పాట్ కమిన్స్ ను 18 కోట్లకు, అభిషేక్ శర్మను 14 కోట్లకు , నితీష్ రెడ్డిని 6 కోట్లకు , హెన్రిచ్ క్లాసెన్ ను అత్యధికంగా 23 కోట్లకు, ట్రావిస్ హెడ్ 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరి వేలంలో కావ్యా పాప స్ట్రాటజీ సన్ రైజర్స్ కు టైటిల్ అందిస్తుందో లేదో చూడాలి.