సౌతాఫ్రికాతో రెండో టీ ట్వంటీకి భారత్ రెడీ అయింది. తొలి మ్యాచ్ లో సఫారీలను చిత్తుగా ఓడించిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మొదటి టీ ట్వంటీలో అభిషేక్ శర్మ నిరాశపరిచినా.. సంజూ శాంసన్ మాత్రం అదరగొట్టాడు. ఏకంగా సెంచరీతో సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. టీ ట్వంటీ ఫార్మాట్ లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ రికార్డుల మోత మోగించాడు. దీంతో సంజూపై భారీ అంచనాలున్నాయి. అటు అభిషేక్ కూడా తన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే కష్టమే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా తొలి టీ ట్వంటీ మెరుపులు మెరిపించాడు. ఇక మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో హార్థిక్, రింకూ సింగ్ లు ఇంకా తమదైన మెరుపులు చూపించలేదు. ఇదిలా ఉంటే అయితే రెండో టీ20లో తుదిజట్టులో మార్పులు చేయాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ భావిస్తున్నారు. విన్నింగ్ కాంబినేషన్ మార్చడానికి ఇష్టం లేకపోయినా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో కేకేఆర్ రిటైన్డ్ ప్లేయర్, ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో అతను జట్టులోకి వచ్చే అవకాశముంది. తొలి టీ20లో భారత్ 202 పరుగులు భారీ స్కోరు చేసినప్పటికీ చివరి 6 ఓవర్లలో40 పరుగులే చేసింది. పేస్‌తో పాటు హార్డ్ హిట్టర్ రమణ్ దీప్ జట్టులో ఉంటే భారత్ మరింత భారీ స్కోరు చేస్తుందని చెప్పొచ్చు. కాగా తొలి టీ20లో అక్షర్ పటేల్‌ను బౌలింగ్ పరంగా సూర్య ఎక్కువగా ఉపయోగించలేదు. ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌తో స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటంతో రమన్‌దీప్‌కు అవకాశం ఇవ్వాలన్న ఐడియా కనిపిస్తోంది. రమన్‌దీప్ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు మంచి ఫీల్డర్ కావడం మరో కారణం.
బౌలింగ్ పరంగా ఈ ఒక్క మార్పు జరిగే అవకాశాలుండగా… పేస్ ఎటాక్ ను అర్షదీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు. అవేశ్ ఖాన్ కూడా తొలి టీ ట్వంటీలో ఆకట్టుకోవడంతో మేనేజ్ మెంట్ హ్యాపీగా ఉంది. అర్షదీప్ 1 వికెట్ తీయగా.. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు రికార్డుల పరంగా భారత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 28 మ్యాచ్‌లు ఆడగా టీమిండియా 16 మ్యాచ్‌ల్లో, సౌతాఫ్రికా 11 మ్యాచ్ లలో గెలిచాయి. అయితే సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది. సిరీస్ ను సమం చేయాలనుకుంటున్న సఫారీలు బ్యాటింగ్ లో మెరుగైతే తప్ప భారత్ ను నిలువరించడం కష్టంగానే కనిపిస్తోంది.