టెక్కలి నియోజకవర్గం (Tekkali Constituency) తెలుగుదేశంకి (Telugu Desam Party) కంచుకోట. దాన్ని బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో వైసీపీ (YCP) పని చేసిందా ? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఫస్ట్ టైమ్ ఓడించబోతున్నారా? అయితే వైసీపీలోని అంతర్గత విభేదాలే కలిసొస్తాయని టీడీపీ (TDP) అభ్యర్థి భావిస్తున్నారా? వైసీపీ నేతల గెలుపు లెక్కలు ఏంటి? టీడీపీ కాన్ఫిడెన్స్ ఏంటి ? అసలు టెక్కలిలో నెగ్గేదెవరు ?
ఏపీలోని టెక్కలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సింపతీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే…తమను గెలిపిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) లెక్కలు వేసుకుంటున్నారు. 2014, 2019లో టెక్కలి నుంచి గెలిచిన అచ్చెన్న… మూడోసారి గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ఫలితాల కోసం రెండు అభ్యర్థులు… ఊపిరి బిగపట్టుకొని వెయిట్ చేస్తున్నారు. నేతలతో పాటు కార్యకర్తల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియెజకవర్గంలో… టెక్కలి, నందిగాం, కోటబోమ్మాళి, సంతబొమ్మాళి మండలాలు ఉన్నాయి. టెక్కలి నియోజకవర్గం తెలుగుదేశం ఆవిర్బావం నుంచి పార్టీకి కంచుకోట. కొట బొమ్మాళి, సంతబోమ్మాళి మండలాల్లో చీమ చిటుక్కుమన్నా… కింజరాపు ఫ్యామిలీ (Kinjarapu Family) కి తెలియాల్సిందే.
ఈ రెండు మండలాల్లో కనుసైగలతో రాజకీయాలు శాసిస్తోంది కింజరాపు కుటుంబం. 1983 నుంచి ఎర్రంనాయుడు ప్రాతినిధ్యం వహించిన హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దయి… 2009లో టెక్కలి నియోజకవర్గంగా ఏర్పాటైంది. 1996 నుంచి ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు. ఆరు సార్లు పోటీ చేశారు. 1996, 1999, 2004 హరిశ్చంద్రాపురం నుంచి, 2014, 2019 ఎన్నికల్లో టెక్కలి నుంచి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో మాత్రమే కొర్ల రేవతిపతి చేతిలో ఓడారు. మొత్తంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు… ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగానూ పని చేశారు. 2019 వైసీపీ హవాలోనూ విజయం సాధించారు. మంత్రిగా నియెజకవర్గంలో చేసిన అభివృద్ధి… మంచి వాగ్దాటి, కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలబడటం ఆయన బలం. ఎర్రన్న వారసత్వం, పార్టీతో పాటు కింజరాపు కుటుంబపరంగా అభిమానం గెలుపు తీరాన్ని చేరుస్తాయని భావిస్తున్నారు. వైసిపి (YCP) లో అనైక్యత తమకు కలసొస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
2014 ఎన్నికల్లో 78.4 శాతం… 2019 ఎన్నికల్లో 78.51 శాతం పోలింగ్ నమోదైంది. టెక్కలి నియోజకవర్గంలో 2,34,480 మంది ఓటర్లు ఉంటే… లక్షా 84 వేల మంది ఓట్లేశారు. దాంతో 80.51శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో మహిళల ఓట్లే ఎక్కువ. ఇది తమకు కలసి వస్తుందని అధికార పార్టీ లెక్కలేస్తోంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు లబ్ది పొందిన మహిళా ఓటర్లు తమకు అండగా నిలబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ భావిస్తున్నారు. సామాజిక అస్త్రం సంధించడం, నేతల మధ్య అనైక్యతను సెట్ చేయడం, వైసీపీ నాయకులకు ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలబడం ఆ పార్టీకి ప్లస్‌గా మారిందని నేతలు చెబుతున్నారు. 4 వేల కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మాణం కూడా కలసి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) టెక్కలి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో…నేతలు ఎన్నడూ లేని విధంగా కలిసికట్టుగా పని చేశారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ ఘోరంగా దెబ్బతింది. టెక్కలి నియోజకవర్గంలో 15 గ్రామాల్లో టీడీపీ…రిగ్గింగ్ పాల్పడుతుండటమే ఓటమికి కారణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టడం, ఈసీ ద్వారా వెబ్ కాస్టింగ్ పెట్టించడంతో రిగ్గింగ్‌కు అడ్డుకట్ట వేయగలిగామని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో ఈసారి వైసీపీ గెలుపు ఖాయమనీ… టెక్కలిలో వైసీపీ జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉన్నారు. రెండు పార్టీల అంచనాలు ఎవరికి వారే తమదే గెలుపుంటూ భరోసాగా ఉన్నారు.