భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు కౌంట్ డౌన్ మొదలైంది. పుణే వేదికగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో అనూహ్యంగా పరాజయం పాలైన భారత్ సిరీస్ లో 0-1తో వెనుకబడింది. సొంతగడ్డపై ఒకవిధంగా రోహిత్ సేనకు ఇది షాకే.. ఇప్పుడు సిరీస్ ను సమం చేయడమే లక్ష్యంగా రెండో టెస్టుకు సిద్ధమైంది. బెంగళూరు టెస్టులో కివీస్ పేసర్లు మన బ్యాటర్లను దెబ్బకొట్టారు. కేవలం 46 రన్స్ కే ఆలౌట్ చేసి తొలిరోజే మ్యాచ్ పై పూర్తిస్థాయిలో పట్టుబిగించేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా పోరాడినప్పటకీ ఫలితం లేకపోయింది. సర్ఫరాజ్ , పంత్ పోరాటంతో ఇన్నింగ్స్ ఓటమిని మాత్రమే తప్పించుకోగలిగింది. ఇప్పుడు కివీస్ ను స్పిన్ వ్యూహంతోనే దెబ్బకొట్టేందుకు భారత్ ప్లాన్ చేసింది. దీని కోసం స్పిన్ పిచ్ పై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది.
నిజానికి సొంతగడ్డపై స్పిన్నర్లే భారత్ ప్రధాన బలం… బెంగళూరులో మాత్రం పిచ్ పూర్తిస్థాయిలో స్పిన్ కు అనుకూలించకపోవడం దెబ్బతీసింది. అదే సమయంలో మన పేసర్లు వైవిధ్యం చూపలేకపోవడం కూడా ఓటమికి కారణమైంది. ఇదిలా ఉంటే సిరీస్ సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్ తుది జట్టులో కొన్ని మార్పులు తప్పేలా లేవు. మెడనొప్పి కారణంగా తొలి మ్యాచ్ కు దూరమైన శుభ్ మన్ గిల్ జట్టులోకి తిరిగి రానున్నాడు. అటు రిషబ్ పంత్ కూడా ఫిట్ గానే ఉన్నాడని తెలుస్తోంది. తొలి టెస్టులో గాయంతోనే బ్యాటింగ్ చేసిన పంత్ కీపింగ్ కు దూరంగా ఉన్నాడు. తాజాగా నెట్ ప్రాక్టీస్ లో కీపింగ్ కూడా చేయడంతో పుణే టెస్టులో ఆడడం ఖాయైమనట్టే కనిపిస్తోంది.
అటు తొలి టెస్టులో 150 రన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ కు తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే.. కెఎల్ రాహుల్ వరుసగా విఫలమవుతున్నా కోచ్ గంభీర్ మాత్రం సీనియర్ ప్లేయర్ కే అతనికే మద్ధతుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే బౌలింగ్ పరంగా చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్లు ఖాయం. అయితే కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్ లలో ఒకరికే చోటు దక్కనుంది. ఇక పేస్ విభాగంలో సిరాజ్ పై వేటు పడే అవకాశముంది. సిరాజ్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీంతో హైదరాబాదీ పేసర్ స్థానంలో ఆకాశ్ దీప్ ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్సుంది. ఇక పుణే పిచ్ స్లో బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ, అశ్విన్ లకు మంచి రికార్డుండగా… భారత్ ఇక్కడ రెండు టెస్టులు ఆడి ఒకటి గెలిచి మరొకటి ఓడిపోయింది. మరోవైపు న్యూజిలాండ్ తుది జట్టు మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ కూ దూరమయ్యాడు.