Non Stop Rains: పదిరోజుల్లో 2 ఆవర్తనాలు.. ఆగస్ట్ వరకు ఇవే వానలు !

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయ్. 48గంటలుగా నాన్‌స్టాప్ వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 03:52 PM IST

మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది. సియర్‌సూన్‌ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని.. నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

ఇక అటు ఏపీలో వానలు ఊపందుకున్నాయి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనానికి తోడు రుతుపవనాలు కూడా జోరు అందుకున్నాయి. అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతంలోనే అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలుపుతున్నారు ఐఎండి అధికారులు. ఇటు రుతపవన ద్రోణి తూర్పు భాగం కటక్‌ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది.

ఈ ప్రభావంతో మరో మూడు రోజులు ఎక్కువగా మోస్తరు వర్షాలు.. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రెండు రోజుల ముసురుకే.. తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయ్. ఇప్పుడు ఆగస్ట్ వరకు వానలు అనడంతో.. జనాలు వణికిపోతున్నారు. ఆలస్యంగా పలకరించిన వరుణుడు.. పగపట్టాడా అనే రేంజ్‌లో వర్షాలు కురవడం.. టెన్షన్ పెడుతోంది.