ప్రతీసారి మనం గెలిచేందుకే కాదు.. ప్రత్యర్థి ఓడిపోయేందుకు కూడా వ్యూహాలు రచించారు. రెండు ఒకేలా అనిపిస్తున్నా.. వినిపిస్తున్నా.. ఇవి వేర్వేరు ! రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలే కనిపిస్తుంటాయ్. తమ బలం పెంచుకోవడంతో పాటు.. ప్రత్యర్థి బలహీనతలను పెంచుతూ టార్గెట్ చేస్తుంటాయ్ పార్టీలు. ఇలాంటి వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా ! అలాంటి కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు ఇప్పుడు కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ భారీ ప్లస్ కాబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రెండో జాబితా ఎంపికలో కాంగ్రెస్ చాలా పొరపాట్లు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. చేరికలకు ప్రాధాన్యం ఇచ్చి.. కొత్త వారిటి టికెట్ కేటాయించిన కాంగ్రెస్.. సీనియర్లను గాలికి వదిలేసిందని.. క్షేత్ర స్థాయి పరిస్థితులను పక్కనపెట్టేసిందనే చర్చ జరుగుతోంది.
ఫస్ట్ లిస్ట్‌కు మించి.. సెకండ్ లిస్ట్ ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తులు కనిపిస్తున్నాయ్. 100 స్థానాలకు టికెట్ కేటాయించడంతో.. థర్డ్ లిస్ట్ మీద ఆశావహులు ఆశలు వదిలేసుకున్నారు. దీంతో తమ ఆవేశాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎర్రశేఖర్ నుంచి నితిన్ మామ నగేశ్ రెడ్డి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి.. ఇలా చాలామంది నేతలు అవసరం అయితే ఇండిపెండెట్లుగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరికొందరు అయితే.. పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఇదే జరిగితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ చీలి.. ప్రత్యర్థి పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. బీసీలకు పెద్ద పీట వేసే క్రమంలో.. సామాజిక సమీకరణాల్లో కాంగ్రెస్ తప్పుడు అడుగులు వేసిందనే ఒపీనియన్ కూడా వినిపిస్తోంది.
ఆసిఫాబాద్‌లాంటి నియోజకవర్గంలో ఆదివాసీల ప్రభావం ఎక్కువ. అదే సామాజికవర్గానికి చెందిన ముర్సుకోలు సరస్వతిని పక్కన పెట్టి కొత్తగా పార్టీలో చేరిన అజ్మీరా శ్యామ్ నాయక్‌కు టికెట్ కేటాయించింది. ఐతే ఇక్కడ ఆదివాసీలకే టికెట్ ఇవ్వాలని సొంత పార్టీలోనే ప్రచారం మొదలైంది. శ్యామ్ నాయక్‌కు అసిఫాబాద్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొన్ని గ్రామాల్లో అయితే ప్రచారం కూడా బహిష్కరించారు. ఇలా ఎలా లెక్కలు వేసుకున్నా.. సీనియర్లను, పార్టీని నమ్ముకున్న వాళ్లను పక్కన పెట్టి.. జంపింగ్‌లకు చాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ తప్పు చేసిందని మరికొందరు అంటున్నారు. ఐతే ఇంకొందరి అభిప్రాయం ఇంకోలా ఉంది.
మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కాంగ్రెస్ రెండు టికెట్లు కేటాయించింది. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, కంభం అనిల్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, జహీరాబాద్ నుంచి ఆగం చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు లాంటి ఫిరాయింపుదారులకు కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. దీంతో కాంగ్రెస్ గెలుపు గుర్రాలను మాత్రమే నమ్ముకుందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎవరి అభిప్రాయం కరెక్ట్ అవుతుంది. ఏ అంచనా నిజం అవుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి.