ఆస్ట్రేలియా టూర్ ను భారత్ ఘనంగా ఆరంభించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో కంగారూలను చిత్తు చేసింది. 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్ ను ఓడించి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌటైన భారత్ తర్వాత కంగారూలను 104 పరుగులకే పరిమితం చేయడం , రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోర్ సాధించడం భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాయి. నాలుగోరోజు కూడా మన బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ఆసీస్ కు చెక్ పెట్టారు. 534 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 58.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు. కాగా ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ మళ్ళీ టాప్ ప్లేస్ కు దూసుకొచ్చింది.
ఈ సిరీస్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా… భారత్ రెండో స్థానంలో ఉంది. అయితె పెర్త్ విజయంతో ఇరు జట్ల స్థానాలు తారుమారయ్యాయి. పెర్త్ లో సాధించిన భారీ విజయంతో టీమిండియా మళ్ళీ అగ్రస్థానానికి చేరింది. తాజాగా భారత్ 61.11 పాయింట్లతో టాప్ ప్లేస్ లోకి వెళ్ళగా… ఘోరపరాజయం చవిచూసిన కంగారూలు రెండో స్థానానికి దిగజారారు. పెర్త్ టెస్ట్ ఓటమితో ఆసీస్ విజయశాతం 62.5 నుంచి 57.6కు పడిపోయింది. భారత్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ పోరుకు అర్హత సాధించాలంటే టాప్ 2 లో నిలవాలి. ఈ క్రమంలో పెర్త్ టెస్ట్ గెలిచి సిరీస్ లో శుభారంభం చేసిన టీమిండియా ఇంకా 4 మ్యాచ్ లల్లోనూ సత్తా చాటితే తిరుగులేని ఆధిపత్యంతో డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది.
మరోవైపు ఆస్ట్రేలియా కంటే సౌతాఫ్రికా ఈ రేసులో ముందుంది.55.56 పాయింట్లతో శ్రీలంక మూడు, 54.55 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికా 54.17 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతుంది. సఫారీలు డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు మరో నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు శ్రీలంకపై.. మరో రెండు పాకిస్థాన్ పై ఆడనుంది. ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్ లు కూడా సౌతాఫ్రికా వారి సొంత గడ్డపై ఆడనుంది. అదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తో భారత్, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫ్యూచర్ డిసైడ్ కాబోతోంది.