Wrestlers vs Modi: బ్రిటీష్‌ పాలకులకు పట్టిన గతే బీజేపీకి! వాళ్లని ప్రజలు తరిమి తరిమి తంతారంటున్న దంగల్ తండ్రి!

సామాన్యులని ప్రలోభపెట్టే వేషాలు వేస్తే ఏదో ఒక రోజు ప్రజలు తరిమి తరిమి తంతారు. ఇదే విషయాన్ని మాజీ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ పోగట్‌ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నిజాలను బయటకు రానివ్వకుండా రెజ్లర్ల పోరాటాన్ని అణిచివేయాలని చూస్తున్న బీజేపీ పెద్దలపై ఫైర్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 05:52 PM IST

ఇంతింతై వటుడింతై అన్నట్టు చిన్న చిన్న పోరాటాలు పెరిగి పెద్దై.. ఆ తర్వాత మహా వృక్షమై..పాలకులపై తిరగబడి.. తమని అణిచివేసిన వాళ్లని సరిహద్దుల వరకు తరిమి తరిమి కొడతారన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇండియాను వందల ఏళ్లు పాటు ఏలిన బ్రిటీష్‌ వారికైనా.. ప్రపంచంపై పెత్తనం చూపించిన రాజులకైనా ఇదే గతి పట్టింది. ఈ విషయం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలియనది కాదు. ఇందిరాగాంధీ పతనానికి దారి తీసింది కూడా ఇలాంటి పరిణామాలే. 190ఏళ్లు భారత్‌ను పాలించిన బ్రిటీష్‌ వాళ్లు దేశం విడిచి పోయింది కూడా ఈ ధర్నాలు, ర్యాలీలు, నిరసనల తర్వాత పెరిగి పెద్దైన ఉద్యమాల దెబ్బకే! వాటిని పట్టించుకొకపోతే..ఇంకా లైట్ తీసుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. భారత్‌ గర్వించదగ్గ రెజ్లర్లలో ఒకరైన మహావీర్ పోగట్‌ ఇదే విషయాన్ని క్లియర్‌ కట్‌గా చెప్పారు. బ్రిటీష్‌ పాలకులకు పట్టిన గతే బీజేపీకీ పడుతుందంటూ మండిపడ్డారు.

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ దాదాపు 40రోజులుగా ప్రముఖ రెజ్లర్లు పోగట్‌, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునీయా తదితర యోధులు కేంద్రంపై యుద్ధం చేస్తున్నారు. కేంద్రంతో తాడోపెడో తేల్చుకుంటున్నారు. పోలీసులు కొట్టినా.. కిందపడేసినా.. జైల్లో పెట్టినా అడుగు వెనకు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వారిలో వినేశ్‌ పోగట్‌ ఒకరు. తాజాగా ఆమె తండ్రి మహావీర్ పోగాట్‌ తన కూతురికి మద్దతుగా కేంద్రంపై మండిపడ్డారు. పోగాట్‌ ఫ్యామిలీ గురించి ప్రజలకు తెలియనది కాదు.. అమీర్‌ఖాన్ నటించిన దంగల్‌లో మహావీర్‌ పోగట్‌ పాత్రే ప్రధానమైనది.

ఎంతో కష్టపడి తన కూతుళ్లు పతకాలు తీసుకొచ్చారని..దురదృష్టవశాత్తూ రెజర్లు తమ పతకాలను గంగానదిలో విసిరేయాలని నిర్ణయం తీసుకోవాల్సి రావడం బాధకరమన్నారు పోగాట్‌. రైతు నేతలు తమ మనోభావాలను అర్థం చేసుకున్నారని.. కేంద్రమే రెజర్ల బాధను అర్థం చేసుకోవడంలేదంటూ నిప్పులు చెరిగారు. ఇప్పుడు దేశమంతా ఏకమవుతుందని.. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపకపోతే బ్రిటిష్ వారిలా దేశ ప్రజలు బీజేపీని తరిమికొడతారని మహావీర్ పోగట్‌ హెచ్చరించారు. ఇప్పుడు అలాంటి ఉద్యమం మొదలవుతుందని, ప్రభుత్వం తలవంచక తప్పదని.. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా మహిళా రెజ్లర్లు, జూనియర్‌ రెజ్లర్లలో ఆందోళన నెలకొంది. ఇదే విషయాన్ని మహావీర్‌ పోగట్‌ కూడా చెప్పారు. ప్రస్తుతం మహిళా రెజ్లర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అమ్మాయిలు ఇకపై రెజ్లింగ్‌ని కెరీర్‌గా ఎంచుకునే అవకాశం ఉండదని.. అటు జూనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మహావీర్‌ పోగట్‌. మహావీర్‌ చెబుతున్నదంతా ప్రాక్టికల్‌గానే అనిపిస్తోంది..ఎందుకంటే నిన్నమొన్నటివరకు రెజ్లర్ల పోరాటంపై పెద్దగా మాట్లాడుకొని ప్రజలు..ఇప్పుడు బీజేపీ చేస్తుంది తప్పేనన్నట్టు మాట్లాడుతున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు సంగతి అటు ఉంచితే కనీసం కేంద్రం స్పందించకపోవడమెంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మెడెల్స్‌ సాధించినప్పుడు ట్వీట్లు చేస్తూ.. స్వదేశానికి రాగానే రెజ్లర్లను ప్రత్యేకంగా అభినందించే మోదీ ఇప్పటికైనా మౌనం వీడితే మంచిది.. లేకపోతే మహావీర్‌ మాటలు నిజమవడానికి ఏడాది సమయమే పట్టొచ్చు.