Mylavaram: మైలవరం పంచాయితీ తెగినట్టేనా? సీటు ఆయనకేనా?

  • Written By:
  • Publish Date - February 10, 2023 / 05:32 PM IST

వైసీపీలో మైలవరం పంచాయితీ తెగిందా…? మంత్రి జోగిరమేష్, సీనియర్ నేత వసంత కృష్ణప్రసాద్ లో ఎవరికి సీఎం సీటు ఖాయం చేశారు…? ఒక్క మీటింగ్ తో సీన్ మారిపోయిందా…? తాడేపల్లి మీటింగ్్లో అసలేం జరిగింది…? ఆ నాయకుడి మాటల్లో దూకుడు ఎందుకు పెరిగింది…?

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీలో కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పంచాయతీ పీక్ కు చేరుతోంది. ఓవైపు మన టార్గెట్ 174 సీట్లని తాడేపల్లి పెద్దలు చెబుతుంటే… నేతలు మాత్రం సీట్ల కోసం సిగపట్లు పడుతున్నారు. ఆరోపణలు, ఫిర్యాదులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాగైతే మొదటికే మోసం వస్తుందని భావించిన వైసీపీ హైకమాండ్ ఆ నియోజకవర్గాలకు వైద్యం మొదలుపెట్టింది. ముందుగా వైసీపీలో హాట్ టాపిక్ గా మారిన మైలవరంపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్…

2019 ఎన్నికల తర్వాత కొన్ని నెలలకే మైలవరం నియోజకవర్గం వైసీపీలో లుకలకలు రాజుకున్నాయి. జోగి రమేష్ వర్గం ఓవైపు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గం ఓవైపు… ఎవరికి వారే వారి మార్క్ రాజకీయాలు చేయడంతో ప్రతిపక్షంతో పనిలేకుండా పోయింది. వారికి వారే ప్రతిపక్షంలా తయారయ్యారు. జోగి రమేష్ పెడన నుంచి గెలిచి మంత్రైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఎవరు సృష్టించారో తెలియదు కానీ వసంతపై సీఎం జగన్ చేయి చేసుకున్నారన్న వార్త నియోజకవర్గంలో కొంతకాలం షికారు చేసింది. పైగా వసంత అనుచరులకు ఎక్కడిక్కకడ మంత్రిగారి వర్గం నుంచి చెక్ పడుతూ వచ్చింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒకరిపై ఒకరు నెగెటివ్ ప్రచారం చేసుకున్నారు. తన నియోజకవర్గంలో తనకు పొగ పెట్టడంతో వసంత తట్టుకోలేకపోయారు.

మైలవరంపై పలుమార్లు తాడేపల్లిలో పంచాయితీలు జరిగాయి. అయినా క్లారిటీ రాలేదు. కానీ రెండ్రోజుల్లో పరిస్థితి మారినట్లే కనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎం జగన్్తో కలసి జర్నీ చేసారు మంత్రి జోగి రమేష్… మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాతి రోజే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్్కు తాడేపల్లికి రావాలని పిలుపు అందింది. ఎప్పుడే వార్త వినాల్సి వస్తుందోనన్న టెన్షన్్తో లోపలకుఎంట్రీ ఇచ్చిన వసంత…. తేటపడిన వదనంతో బయటకొచ్చారు. ఆ హుషారు చూసి సీఎం ఏదో మంచివార్త వినిపించారని భావించారు…

అదే ఉత్సాహంతో ప్రెస్్మీట్ పెట్టిన వసంత కృష్ణప్రసాద్… త్వరలో గడప గడపకు నియోజకవర్గంలో పాల్గొంటానని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పరిస్థితుల కారణంగా కుదరలేదని కానీ ఇకపై జనంలోకి వెళతానని చెప్పుకొచ్చారు. దీంతో మైలవరం టికెట్్పై సీఎం నుంచి స్పష్టమైన హామీ అంది ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సర్కార్్పై సన్నాయి నొక్కులు నొక్కిన వసంత… తాను జగన్ వెంటే ఉంటానన్నారు. అంతేకాదు తన నియోజకవర్గంలో ఎవరు వేలుపెట్టినా సహించేది లేదన్నారు. మంత్రి జోగి రమేష్్పై పరోక్ష విమర్శలు సంధించారు. మొత్తంగా ఎమ్మెల్యే ప్రెస్ మీట్ చూస్తే మైలవరం తనదేనన్న ధీమా కనిపించింది.

పైకి ఒప్పుకోకున్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి గట్టి పోటీ తప్పదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గమూ కీలకమే… అందుకే ఒకరి నియోజకవర్గంలో ఒకరు వేలు పెట్టొద్దని సీఎం జగన్ ఇద్దరికీ గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. పైగా మైలవరంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ యాక్టివ్ అయ్యారు. వసంత, జోగి కొట్టుకుంటే టీడీపీకి ప్లస్ అవుతుందని భావించిన సీఎం సీటుపై వసంతకు క్లారిటీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాల టాక్…

మరి చూడాలి ఇప్పటికైనే వైసీపీ నేతలు తమలో తాము కొట్టుకోవడం మానేసి టీడీపీని ఎదుర్కోవడంపై దృష్టి పెడతారో లేక కొంపలో కుంపటిని కొనసాగిస్తారో…!

(KK)