YCP Bus Yathra: యాత్రలతో హోరెత్తుతున్న ఏపీ రాజకీయాలు.. ఈనెల 26 నుంచి వైసీపీ సామాజిక సాధికార యాత్ర

తెలంగాణ ఎన్నికల వేడి ఏపీకి కూడా విస్తరించినట్లు కనిపిస్తోంది. ఒకరు నిజం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేపడుతుంటే.. మరోకరు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్నారు. నిజం గెలుస్తుందా.. సామాజిక న్యాయం గెలుస్తుందా తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.

  • Written By:
  • Publish Date - October 24, 2023 / 05:14 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి రేపటి నుంచి న్యాయం గెలవాలి అంటూ బస్సు యాత్ర చేపడుతోంది. దీనికి కారణం చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని చెబుతూ ఈ యాత్రను చేపడుతోంది. ఇక వైసీపీ విషయానికొస్తే చేసిన సంక్షేమాన్ని చెప్పుకునేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటుంది. మూడు ప్రాంతాల్లో ఈనెల 26 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలునే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మూడు ప్రాంతాల్లో ముందుగా నిర్థేశించిన ఊళ్లో బహిరంగసభలు ఉంటాయి. ఇందులో స్థానికి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పాల్గొననున్నారు. గతంలో జగన్ అన్నట్లు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దీనిని భుజానికెత్తుకోనున్నారు. ఈ యాత్ర డిశంబర్ నెలాఖరు వరకూ కొనసాగనున్నట్లు చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.

యాత్రలోనూ విభజనే..

ఈ సామాజిక సాధికారత యాత్ర విడతల వారీగా సాగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగా తొలి విడత యాత్ర నవంబర్ తొమ్మిదో తేదీ వరకూ జరుగనుంది. ఈ తరువాత జరిగే యాత్రల షెడ్యూల్ ను త్వరలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మూడు ప్రాంతాలకు మూడు బస్సులు సిద్దం చేశారు. పార్టీ రంగులు, సంక్షేమ పథకలు కనిపించేలా స్టిక్కర్లు, సామాజిక న్యాయం ప్రతిబింబించేలా ఫ్లెక్సీలతో రూపొందించారు. ఇక వైసీపీ ఎవర్ గ్రీన్ డైలాగ్ మా నమ్మకం నీవే జగన్ అనే నినాదాన్ని ప్రజల్లోకి మరోసారి తీసుకుపోతున్నారు.

ఉత్తరాంధ్ర..

  • అక్టోబర్ 26 ఇచ్చాపురం
  • 27 గజపతినగరం
  • 28 భీమిలి
  • 30 పాడేరు
  • 31 ఆముదాలవలస
  • నవంబర్ 1 పార్వతీపురం
  • 2 మాడుగుల
  • 3 నరసన్నపేట
  • 4 శృంగవరపుకోట
  • 6 గాజువవాక
  • 7 రాజాం
  • 8 సాలూరు
  • 9అనకాపల్లి

కోస్తాంధ్ర

  • అక్టోబర్ 26 తెనాలి
  • 27 నరసాపురం
  • 28 చీరాల
  • 30 దెందులూరు
  • 31 నందిగామ
  • నవంబర్ 1 కొత్తపేట
  • 2 అవనిగడ్డ
  • 3 కాకినాడ రూరల్
  • 4 గుంటూరు తూర్పు
  • 6 రాజమండ్రి
  • 7 వినుకొండ
  • 8 పాలకొల్లు
  • 9 పామర్రు

రాయలసీమ

  • అక్టోబర్ 26 సింగనమల
  • 27 తిరుపతి
  • 28 ప్రొద్దుటూరు
  • 30 ఉదయగిరి
  • 31 ఆదోని
  • నవంబర్ 1 కనిగిరి
  • 2 చిత్తూరు
  • 3 శ్రీకాళహస్తి
  • 4 ధర్మవరం
  • 6 మార్కాపురం
  • 7 ఆళ్లగడ్డ
  • 8 నెల్లూరు రూరల్
  • 9 తంబళ్లపల్లె

సామాజిక న్యాయమే ఎజెండా..

ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లీడర్లు మాట్లాడతారు. ఈ మొత్తం యాత్ర, అందులోని సభలు స్థానిక ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరుగుతాయి. ఈ విషయాన్ని గతంలో విజయవాడలో జరిగిన ప్రజాప్రతినిథుల సమావేశంలో జగన్ తెలిపారు. ఇప్పటి వరకూ ప్రతి అంశంలో వెనుకబడిన వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో, మంత్రి పదవుల్లో కూడా మహిళలతో పాటూ ఈ సామాజికవర్గానికి పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక వైపు జనసేనాని వారాహి యాత్ర, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి యాత్ర, వైసీపీ సంక్షేమ సాధికారత పేరుతో వరుస యాత్రలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో ప్రచార వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రానున్న రోజుల్లో ఎవరి యాత్రకు ప్రజలు పట్టంకడతారో తెలియాలంటే ఆరునెలలపాటూ వేచి చూడకతప్పదు.

T.V.SRIKAR