ఏపీలో అధికారంలో ఉన్నన్నాళ్ళూ… బీజేపీకి అంటకాగి… NDA ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దూరమైనట్టేనా ? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా తర్వాత బీజేపీతో తాడో పేడోకి రెడీ అయినట్టు అర్థమవుతోంది. గత మోడీ ప్రభుత్వ హయాంలో వైసీపీని వాడుకున్న బీజేపీ… ఏపీలో చంద్రబాబు, పవన్ దగ్గరవగానే వదిలేసింది. కానీ రాజ్యసభలో వైసీపీ ఎంపీల అవసరం ఉంది.. అందుకే జగన్ కూడా ఈ ఐదేళ్ళూ చూసీ చూడనట్టు కళ్ళు మూసుకుంటే పోయేది. కానీ ఢిల్లీలో ధర్నా చేసి… డైరెక్ట్ గా NDA కూటమితోనే పెట్టుకున్నారు.
ఈ ధర్నాకు సమాజ్ వాదీ పార్టీతో పాటు మిగతా పార్టీల నేతలు కూడా రావడంతో ఇండియా కూటమికి వైసీపీ దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఈ పార్టీలు జగన్ ను కలిసే అవకాశం లేదు. కానీ నేషనల్ లెవల్లో ఇండియా కూటమిలో వైసీపీ జాయిన్ అయినా… ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో కొట్లాడుతోంది. పైగా తన చెల్లెలు షర్మిలే ఆయనకు ప్రత్యర్థి. ఢిల్లీ ధర్నాతో జగన్ కు కొత్త మిత్రులు దొరికితే… బీజేపీకి కొత్త శత్రువు ఎదురైంది. బీజేపీ బద్ధ శత్రువులంతా జగన్ కి సపోర్ట్ ఇచ్చారు. అయితే దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న అనుమానాలు బీజేపీలో ఉన్నాయి. దాంతో ఇక జగన్ పై ఉన్న అక్రమాస్తులు కేసులు స్పీడప్ అందుకున్నట్టే అంటున్నారు. ED, CBI కేసులతో పాటు కొత్తగా ఏపీ ప్రభుత్వం పెట్టే అవినీతి కేసులూ తోడవుతాయి. ఇక బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎలాగూ సీబీఐ దగ్గరే ఉంది. గత ఐదేళ్ళలో అక్రమాస్తుల కేసు అంత స్పీడ్ గా ఎంక్వైరీ జరగకపోవడానికి… వైసీపీతో బీజేపీ దోస్తీయే కారణమని అందరికీ తెలుసు. కానీ ఆ ఛాన్స్ ని జగన్ మిస్ చేసుకున్నట్టు అర్థమవుతోంది.
వైసీపీ విషయంలో కాంగ్రెస్ ప్లాన్ ఏంటన్నది ప్రస్తుతం అర్థం కాకుండా ఉంది. ఏపీలో జగన్ చేసిన ద్రోహం వల్లే ఆ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. అలాంటి జగన్ ని కాంగ్రెస్ మళ్ళీ దగ్గర తీసుకుంటుందని ఊహించలేం. ఆయన మీద కోపంతోనే… అపోజిట్ గా చెల్లెలు షర్మిలను దించింది. రాబోయే రోజుల్లో NDA ప్రభుత్వంతో YCPఎలా వ్యవహరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కేసులకు భయపడి NDA కి మద్దతు ఇస్తే… మిగతా పార్టీలు జగన్ ను ద్రోహిగా ముద్ర వేస్తాయి. అలాగని వ్యతిరేకిస్తే… కేసులు మెడకు వేలాడతాయి. ఇవన్నీ గమనిస్తున్న వైసీపీ నేతలు… ఆ ధర్నా ఏదో ఆంధ్రలోనే చేసుకుంటే పోయేది. ఢిల్లీకి రావడం ఎందుకు… అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకు… అసలీ ఐడియా జగన్ కి ఇచ్చిన అడ్వైజర్ ఎవరో అని తలలు పట్టుకుంటున్నారు.