Vizag YCP : పాయకరావుపేటపై వైసీపీ స్పెషల్ ఫోకస్… ఆమెను ఓడించడానికి ఎన్ని ప్లాన్లో !

ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్‌ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం.

ఉమ్మడి విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ (YCP). టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) టార్గెట్‌గా ఎక్స్ ట్రా డోస్‌ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం. వైనాట్‌ 175 (Wynat 175) అంటున్న పార్టీకి ప్రతి సీటు ముఖ్యమే. అయినా సరే… అనితను స్పెషల్‌గా పరిగణించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలన్న పట్టుదలగా వ్యూహాలకు పదును పెడుతున్నారట వైసీపీ నాయకులు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత కేవలం ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయిన నాయకురాలి మీద ఇంతగా ఫోకస్ చేయడమే ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతున్న అనిత తెలుగు మహిళ అధ్యక్షురాలు కూడా. ఆ హోదాలో అధికార పార్టీని, ముఖ్య నాయకత్వాన్ని రాజకీయంగా తీవ్రంగా టార్గెట్ చేసేవారామె. ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవి. ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌తో ఇటీవల దూకుడు పెంచిన అనిత వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో వాతావరణం వేడెక్కుతోంది.

2014లో విజయం సాధించాక తక్కువ కాలంలోనే పార్టీలో ఆమె మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అంతర్గత విభేదాల కారణంగా 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన అనితకు పరాజయం తప్పలేదు. ఓటమి తర్వాత తిరుగుటపాలో పాయకరావుపేటకు వచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గత ఐదేళ్ళుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఓడించి తీరాలన్న టార్గెట్‌తో లోకల్‌గా పావులు కదుపుతోందట వైసీపీ.

సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఊహించని ప్రమోషన్‍ ఇచ్చింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచారాయన. తర్వాత అనిత మీద పోటీకి సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులును సిద్ధం చేసింది. వివాద రహితుడైన సీనియర్ శాసనసభ్యుణ్ణి బరిలోకి దించడం ద్వారా గట్టి పోటీ ఖాయమన్న సంకేతాలు పంపించింది. నియోజకవర్గంలో కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాలు వున్నాయి. ఎస్సీ, కాపు, మత్స్యకార, ఇతర బీసీ కులాల ఆధిపత్యం ఎక్కువ. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ఇక్కడి ఓటర్లను గత ఎన్నికల్లో పూర్తిగా తన వైపు తిప్పుకుంది వైసీపీ. ఆ బలంతోపాటు ఎక్స్‌ట్రాగా సీనియర్స్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెపుతోంది.

పాయకరావుపేట మండలంపై మంత్రి దాడిశెట్టి రాజా ఫోకస్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు MSME కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌కు పాయకరావుపేట నియోజకర్గ బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించింది అధిష్టానం. తాము గెలవాలన్నదానికంటే ప్రత్యర్థిని ఓడించాలన్న కసిగా పని చేస్తున్నారట లోకల్‌ లీడర్స్‌.

కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో ఈసారి జనసేన ప్రభావంపై కూడా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ వైఖరిని గమనించిన ప్రతిపక్షం కూడా అలర్ట్‌ అయి అనితకు మద్దతుగా సేనల్ని మోహరిస్తోందట. నియోజకవర్గ బాధ్యతలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్నారు. గ్రూప్ రాజకీయాలను కట్టడి చేసే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అనిత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణిని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారట గంటా. ఈ పరిణామాలతో ఈసారి పాయకరావుపేట పోరు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.