ఐపీఎల్ మెగావేలానికి ముందు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఫ్రాంచైజీలకు ఆర్థికంగా గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఊహించినట్టే పలువురు యువక్రికెటర్లు ఈ సిరీస్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నారు. దీంతో అన్ క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ నుంచి క్యాప్ట్ ప్లేయర్స్ గా మారిపోతున్నారు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టడంతో వారి కేటగిరీ కూడా మారిపోయింది. వీరిద్దరూ రేపటి మెగావేలంలో క్యాప్డ్ కేటగిరీలో ఉంటారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్‌లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్‌కు ఆడితే క్యాప్డ్ ప్లేయర్‌గా అతనికి సంబంధించిన వేలం నిబంధనలన్నీ మారిపోతాయి. 2024 సీజన్‌లో నితీశ్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున, మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడారు.
ఐపీఎల్-2024 ముగిసిన తర్వాత ఏకంగా ఆరుగురు స్టార్లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. దీంతో వాళ్లకు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు అనే ట్యాగ్ పోయింది. మరోవైపు ఇది ఫ్రాంచైజీలకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. రూ.4 కోట్లతో రిటైన్ చేసుకునే వెసులుబాటు పోయి కనీసం రూ.11 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెగా వేలం రూల్స్ ప్రకారం రిటైన్ చేసుకునే జాబితాలో కనీసం ఒకరైనా ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్ అయి ఉండాలి. కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి. ఆ తర్వాత నాలుగో, ఐదో ఆటగాడికి ఇదే వరస కొనసాగుతుంది. అంటే 18 కోట్లు, 14 కోట్లు ఇవ్వాలి. ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లు అయి ఉంటే ఆరో ఆటగాడు ఖచ్చితంగా అన్‌క్యాప్డ్ అవుతాడు. అతనికి కనీసం రూ.4 కోట్లు ఇవ్వాలి.
దీని ప్రకారం చూస్తే ‘అన్‌క్యాప్డ్’గా నితీశ్ కుమార్ రెడ్డిని కనీసం 4 కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది. అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి. కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మవంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీశ్‌ను కనీసం ఐదో ఆటగాడిగా 11 కోట్లకు కొనసాగిస్తారా అనేది అనుమానమే. అతడిని విడుదల చేసి వేలంలో రైట్ టు మ్యాచ్ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్‌రైజర్స్‌కు మరో అవకాశం ఉంటుంది. మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు. గత సీజన్‌లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు.లక్నో మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కాబట్టి కనీసం ఐదో ప్లేయర్‌గా రూ.11 కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు. మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ప్రదర్శనతో సంబంధం లేకుండా యువక్రికెటర్ల రేటు పెరగడం ఫ్రాంచైజీలు ఆర్థికంగా ఇబ్బందే.