YS JAGAN: ఇప్పటివరకు వివిధ నియోజకవర్గాలకు ప్రకటించిన సమన్వయకర్తలే రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు అని తేల్చేశారు ఏపీ సీఎం జగన్. ఒకట్రెండు చోట్ల మార్పులు మినహా ఇదే లిస్టు ఫైనల్ అన్నారు. మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ హాల్‌లో పార్టీ క్యాడర్‌కు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వివరించారు.
Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే.. బీజేపీ అగ్రనేతలతో కాపు రామచంద్రారెడ్డి భేటీ
“అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది. చిన్న చిన్న మార్పులు తప్ప.. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రస్తుతం ఎవరైతే ఇంఛార్జిలుగా ఉన్నారో వారే అభ్యర్థులుగా ఉంటారు. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయి. వైసీపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లాలి. ఇప్పటివరకు నేను పని చేశాను, ఇక నుంచి పూర్తిగా మీరే పని చేయాలి. మీ బూత్ కమిటీల పరిధిలో ఉన్న ఓటర్లను ఎన్నికల లోపు కనీసం ఐదారు సార్లు కలవండి. మనం చేసిన, చేసే మంచి పనులు చెప్పండి. వైసీపీ ప్రభుత్వ పథకాలను, పనులను ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలి. రానున్న 45 రోజులు అత్యంత కీలకం. రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చాం. వైసీపీ ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వదు. సంక్షేమ పాలన కొనసాగాలేంటే నేనే సీఎంగా ఉండాలి.
57 నెలలు సంక్షేమ పాలన అందించాం. నేను సీఎంగా ఉంటేనే పేదవాడు బాగుపడతాడు. లంచాలు లేకుండా బటన్‌లు నొక్కడం ఉంటుంది. మహిళలకు రక్షణ, విలేజ్ క్లినిక్‌లు పనిచేస్తాయి. వైసీపీ అధికారంలో ఉంటే స్కూళ్ల రూపురేఖలు మారతాయి. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం. మన మేనిఫెస్టో భగవద్గీత, ఖూరాన్, బైబిల్. కానీ టీడీపీకి మాత్రం మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసేదానిగానే చూస్తారు. మా ప్రభుత్వానికి ఘనమైన రికార్డు ఉంది. మనం గొప్పగా పని చేశాం. మన లక్ష్యం 175/175 అని గుర్తుంచుకోండి. 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవాలి. విపక్షాలు చేసే విషప్రచారం తిప్పి కొట్టండి” అని జగన్ వ్యాఖ్యానించారు.