YS JAGAN: కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించడమే లక్ష్యంగా కదులుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు సోమవారం నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేశారు. 34 ఏళ్లుగా చంద్రబాబు చేయలేని పనిని తాము చేశామని చెప్పారు జగన్. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
Hanuma Vihari: ఆంధ్ర ఆటల్లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన నిర్ణయం..
“కుప్పంకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు.? ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు. కుప్పంకు చంద్రబాబు 34 ఏళ్లు ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు. అయినా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు. వైసీపీ ప్రభుత్వంలో కుప్పం అభివృద్ధికి పాటుపడ్డాం. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చాం. కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేయాలన్నదే మా లక్ష్యం. కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ నీళ్లు తెచ్చింది, కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది, రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది.. మీ బిడ్డ జగన్. చంద్రబాబు వల్ల కుప్పానికి ఒక్క మంచి పని జరిగిందా? మీ బిడ్డ సీఎం అయ్యాక మంచి జరిగిందా? ప్రజలకు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు..? భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే, తర్వాత మంత్రిని చేస్తాను.
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మక వెల్లూరు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ.1400 కోట్లు జమ చేశాం. ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు రంగుల మేనిఫెస్టోతో వస్తారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా..?” అంటూ జగన్ వ్యాఖ్యానించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే ఉద్దేశంతో జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీని గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు అడ్డాలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఎన్నికలలోపు మరోసారి జగన్ ఇక్కడ పర్యటించే అవకాశం ఉంది. చంద్రబాబును ఓడిస్తే.. తనకు తిరుగే ఉండదని జగన్ భావిస్తున్నారు.