YS JAGAN: ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని స్పష‌్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నంలోనే ప్రమాణస్వీకారం చేస్తానని వ్యాఖ్యానించారు. విజన్ వైజాగ్ పేరిట పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని విషయంలో ప్రకటన చేశారు. “ఏపీ రాజధాని విశాఖపట్నమే. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎంగా ఇక్కడే ప్రమాణం చేస్తా.
YCP Tickets : వైసీపీ సమన్వయకర్తలు ఉంటారా ? ఊడతారా ? నేతలకు సర్వేల టెన్షన్
ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే ఉంటా. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటా. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉంది. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తాం. నగర అభివృద్ధికి ప్రత్యేక, ఆచరణాత్మక ప్రణాళిక అవసరం. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తాం. దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తాం. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అమలు చేయలేదు. కేంద్ర సహకారం కూడా కావాలి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి జరగాలి. విశాఖలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ నగరం రూపురేఖలు మారుతాయి. దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుంది.
అమరావతి రాజధానికి నేను వ్యతిరేకం కాదు. అది శాసన రాజధానిగా కొనసాగుతుంది. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదు. అమరావతిని రాజధాని చేయాలంటే లక్ష కోట్లు కావాలి. ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది’’ అని జగన్ వ్యాఖ్యానించారు. అయితే, ఇంతకాలం మూడు రాజధానులు అని చెప్పిన జగన్ ఇప్పుడు విశాఖను రాజధానిగా ప్రకటించడం సంచలనంగా మారంది. మరోవైపు అమరావతిపై తనకు కోపం లేదని, అది శాసన రాజధానిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే.. ఏపీకి విశాఖతోపాటు శాసన రాజధానిగా అమరావతిని జగన్ ప్రకటించారు.