దీంతో ఏడాది ముందుగానే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్న వేళ.. వైసీపీ అధినేత జగన్ తన పార్టీకి సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. టీడీపీని కోలుకోనివ్వకుండా దెబ్బ తీసేలా.. అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కూడా ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. పక్కాగా గెలుస్తామని నమ్మకం ఇచ్చిన వారికే ఈసారి సీట్లు వస్తాయని పార్టీ వర్గాలు అంటున్నాయ్. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై వైసీపీ కన్నేసింది.
టెక్కలి అసెంబ్లీ సీటు నుంచి దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి పోటీ చేస్తారని ప్రకటించింది వైసీపీ. జగన్ ఈ నిర్ణయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. టెక్కలి నియోజకవర్గం అంటే.. టీడీపీకి కంచుకోట. ఒకప్పుడు అన్నగారు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గం ఇది. మధ్యలో 2004, 2009 మినహా.. 1983 నుంచి అక్కడ సైకిల్ పార్టీనే విజయం సాధిస్తోంది. క్లీన్‌స్వీప్ టార్గెట్‌గా అడుగులు వేస్తున్న జగన్.. టీడీపీకి కంచుకోటలా ఉన్న నియోజవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీనికోసం ఎలాంటి మార్పులకైనా సిద్ధం అన్నట్లుగా ఆయన నిర్ణయాలు కనిపిస్తున్నాయ్. అచ్చెన్నను ఓడించడమే లక్ష్యంగా. దువ్వాడ వాణికి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి ఎంపీగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. ఈ సారి టెక్కలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. ఐతే వైసీపీ నిర్ణయంతో ఆయన ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. దువ్వాడ శ్రీనివాస్ చాలా సీనియర్ నేత. అతనికి మాస్ ఫాలోయింగ్ తప్ప పర్సనల్‌గా ఓటింగ్ లేదని ముందుగానే గ్రహించిన వైసీపీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా తెలివిగా ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బరిలోకి దించేందుకు సిద్ధమైంది. 175కు 175 గెలిచి తీరాలన్న కసితో ఉన్న జగన్.. అభ్యర్థుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చర్చ జరుగుతోంది.