YS SHARMILA: ఏపీకి ప్రత్యేక హోదా ఏది.. జగన్ పాలనంతా దోచుకోవడమే: వైఎస్ షర్మిల

ఇన్ని అప్పులు తెచ్చారు. అభివృద్ధి ఏమైంది..? రాజధాని ఉందా..? కనీసం ఒక్క మెట్రో ఉందా..? రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. కనీసం 10 పెద్ద పరిశ్రమలు కూడా లేదు. సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా..?

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 03:46 PM IST

YS SHARMILA: ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారని, సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా అని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ పీసీసీగా బాధ్యతలు చేపట్టిన షర్మిల.. తొలిసారిగా ఈ హోదాలో ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. టీడీపీపైనా విమర్శలు గుప్పించారు. “వైఎస్సార్‌ రెండు సార్లు పీసీసీ బాధ్యతలు చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నాకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. గత ఐదేళ్లు వైసీపీ, అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉంది. గత పదేళ్లల్లో ఏపీలో అభివృద్ధి జరిగిందా..? చంద్రబాబు చేసిన అప్పులు రూ.2 లక్షల కోట్లు..జగన్ రెడ్డి చేసిన కోట్లు రూ.3 లక్షల కోట్లపైనే.

YS SHARMILA: షర్మిల కాన్వాయ్ అడ్డగింత.. చెల్లిని చూసి జగన్ భయపడుతున్నారా..?

మొత్తంగా ఏపీపై అప్పుల భారం రూ.10 లక్షల కోట్లు. ఇన్ని అప్పులు తెచ్చారు. అభివృద్ధి ఏమైంది..? రాజధాని ఉందా..? రాజధాని కట్టగలిగారా..? కనీసం ఒక్క మెట్రో ఉందా..? రూ.10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. కనీసం 10 పెద్ద పరిశ్రమలు కూడా లేదు. రోడ్ల నిర్మాణానికి డబ్బుల్లేవు. కనీసం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు కూడా లేవు. దళితులపై దాడులు పెరిగాయి. అన్ని చోట్లా ఇసుక, మైనింగ్ మాఫియానే. అంతా దోచుకోవడం.. దాచుకోవడమే. ప్రత్యేక హోదా ఏమైంది..? పదేళ్లైనా ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా రాలేదనే దాని కన్నా.. పాలకులు తేలేదనే చెప్పాలి. ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే.. పదేళ్లు కావాలని బీజేపీ అడిగింది. చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. ఉద్యమం చేసే వారిపై కేసులు పెట్టారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశారు. దీక్షలు చేశారు. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెడతాం. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం అన్నారు జగన్.

TOLLYWOOD: ఒక్కడిని నమ్ముకుంటే దెబ్బే.. అందుకే ఒకేసారి రెండు.. ట్రెండ్ మార్చిన మేకర్స్

సీఎం అయ్యాక జగన్ ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా..? స్వలాభం కోసం వైసీపీ-టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి. చంద్రబాబు త్రీడీ గ్రాఫిక్సులో రాజధాని చూపెట్టారు. జగన్ వచ్చి మూడు రాజధానులన్నారు.. ఒక్కటైనా కట్టారా..? ఏపీ రాజధాని అంటే ఏది అనే పరిస్థితి వచ్చింది. వైఎస్ చనిపోయాక పోలవరం నిర్మాణం అడుగు కూడా ముందుకు పడలేదు. బీజేపీతో దోస్తీ కోసం టీడీపీ, వైసీపీలు పోలవరాన్ని తాకట్టు పెట్టాయి. వైసీపీ – టీడీపీ దొందూ దొందే. ఇవాళ అప్పులేని రైతు ఎవరైనా ఉన్నారా..? వైసీపీ, టీడీపీ ఎంపీలు బీజేపీకి తొత్తుల్లా మారారు. బీజేపీ ఏం చెబితే ఏపీ ఎంపీలంతా గంగిరెద్దుల్లా తలలూపుతారు. బీజేపీకి సహకరిస్తున్న వైసీపీ- టీడీపీలకు ఎందుకు ఓటేయాలి..? బీజేపీకే ఓటేయొచ్చు కదా..? బీజేపీకి వైసీపీ, టీడీపీ అమ్ముడుపోయాయి. ప్రజల దగ్గర బీజేపీతో తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తారు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ తొత్తులే. బీజేపీతో టీడీపీ-వైసీపీలు పరోక్షంగా పొత్తులు పెట్టుకున్నాయి. బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీకి వైసీపీ-టీడీపీలు మద్దతిస్తున్నాయి..? మణిపూర్‌లో చర్చిలను ధ్వంసం చేసినా క్రైస్తవుడైన జగన్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

ఇలా చేస్తే క్రైస్తవులకు మండదా..? మనుషులు చచ్చిపోతున్నా బీజేపీకే సపోర్ట్ చేస్తారా..? కంటికి కనిపించకున్నా బీజేపీతో వైసీపీ-టీడీపీలకు పొత్తు ఉంది. వైసీపీ, టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. వైఎస్సార్.. బీజేపీకి వ్యతిరేకం. బీజేపీ మతతత్వ పార్టీ. వైఎస్ ఆశయాలు కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి. వైఎస్ ఆశయాలు మరే ఇతర పార్టీలో నెరవేరవు. రండి వైఎస్సార్ అభిమానులంతా చేతులు కలపండి. వైఎస్సార్ ఆశయాల కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ ఆశయాలు సాధిద్దాం. నేను రెడీ.. మీరు రెడీనా..?” అని షర్మిల వ్యాఖ్యానించారు.