YS SHARMILA: వైఎస్సార్‌టీపీ పేరుతో తెలంగాణలో రాజకీయం చేద్దామని వచ్చిన షర్మిల ఇప్పుడు బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోంది. అందుకోసం కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్‌లో చేరి.. జగనన్నకు పోటీ రాజకీయాలు చేయబోతోంది షర్మిల. తమ కుటుంబానికి దగ్గరగా ఉండి.. వైసీపీలో ఇమడలేకపోతున్న అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ లీడర్లను కూడా షర్మిల కాంగ్రెస్‌లోకి తీసుకొస్తోందన్న టాక్స్ నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. వైఎస్సార్ పేరు చెప్పుకొని ఓట్లడిగే పార్టీలు రెండు కాబోతున్నాయి. ఇప్పటి దాకా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ తన తండ్రి ఫోటో పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెల్లి షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటోతోనే కాంగ్రెస్ తరపున పోటీకి దిగబోతోంది.
ARTICLE 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. ప్రధాని స్పందన ఇదే..!
జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీని షర్మిల, ఆమె తల్లి విజయలక్ష్మి కాపాడారు. ఊరూ వాడా తిరుగుతూ వైసీపీ తరపున ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక.. వీళ్ళద్దిర్నీ పక్కనబెట్టేశారు జగన్. కుటుంబంలో ఆస్తి తగదాలే అందుక్కారణమన్న వార్తలు కూడా వచ్చాయి. దాంతో తెలంగాణ నా మెట్టినిల్లు ఇక్కడ రాజకీయం చేస్తా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనకు ఆ హక్కు ఉందంటూ వైఎస్సార్‌టీపీని పెట్టారు. తెలంగాణలో పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్‌పై పోరాటం చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత టార్గెట్‌గా విమర్శలు చేశారు. తీరా ఎన్నికల ముందు అస్త్రసన్యాసం చేసి.. కాంగ్రెస్‌కే మా సపోర్ట్ అంటూ పోటీ నుంచి తప్పుకున్నారు షర్మిల. అంతకుముందు తన పార్టీని విలీనం చేద్దామని ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల చుట్టూ చక్కర్లు కొట్టినా తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ లీడర్లు ఎవరూ ఒప్పుకోలేదు. చివరకు చేసేది లేక కాంగ్రెస్‌కి సపోర్ట్ పేరుతో తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు షర్మిల. వైఎస్సార్‌టీపీ విలీనానికి అడ్డం పడిన రేవంత్ రెడ్డిపై కక్ష పెంచుకొని.. ఆయన సీఎం అవడానికి వీల్లేదని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చారు షర్మిల. కానీ, డామిట్.. కథ అడ్డం తిరిగింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. దాంతో ఏం చేయాలో తెలియని షర్మిల ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. షర్మిల తమ పార్టీ తరపున అడుగుపెడితే పూర్వవైభవం వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించడం సంచలనంగా మారింది.
షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తే వైసీపీలోని అసంతృప్తులను లాక్కుంటారన్న టాక్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల నాటికి కొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయి. షర్మిల రాకతో ఏపీలో తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు సంతోషంగా ఉన్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీ కూటమిలో మాత్రం అలజడి మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఇప్పటికే టీడీపీతో జతకడుతోంది జనసేన. కానీ ఇప్పుడు షర్మిల రాకతో.. వైసీపీ ఓట్లు చీలడంతో పాటు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకీ గండిపడుతుందని భయపడుతున్నారు. అయితే షర్మిల తెలంగాణలో ఎంత యాగీ చేసినా జనం గుర్తించలేదు. ఇప్పుడు ఆంధ్ర జనం మాత్రం షర్మిలను ఆదరిస్తారా అన్న టాక్ కూడా రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ జగనన్న తనకు అన్యాయం చేశాడనీ.. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వచ్చాను.. ఆశీర్వదించండి అంటూ సెంటిమెంట్ కార్డ్ ప్రయోగిస్తే షర్మిలను కరుణించి జనం ఓట్లేస్తారా అన్నది కూడా చూడాలి.
కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం షర్మిలను ఆంధ్రప్రదేశ్‌లోకి దించడం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని భావిస్తోంది. దీనికి తోడు పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో లాగే కొత్త పథకాల హామీలు, గ్యారంటీలతో ఏపీలో వెళ్ళాలని ప్లాన్ చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో జనం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా భావించారు. ఏపీ జనం కూడా అలాగే ఆలోచిస్తే అక్కడ అధికారం చేపట్టవచ్చని హస్తం పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రామిస్ చేసే ఛాన్స్ కూడా ఉంది. షర్మిల ద్వారా వైఎస్ సెంటిమెంట్, గ్యారంటీలు, స్పెషల్ స్టేటస్.. ఈమూడు అంశాలతో ఏపీలో అధికారంలోకి రావొచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.