YS Sharmila: డీకేతో భేటీ వెనక షర్మిల భారీ వ్యూహం ఉందా ?

పోయేవాళ్లే కానీ.. వచ్చేవాళ్లు లేకపాయె అన్నట్లుగా ఉంది షర్మిల వైటీపీ తీరు. ఎలాగైనా వార్తల్లో ఉండాలి.. పొలిటికల్ అటెన్షన్ డ్రా చేయాలని.. షర్మిల పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అరెస్టులు, పోలీసుల మీద చేయి చేసుకోవడాలు, ప్రగతి భవన్‌ ముట్టడింపు వార్నింగ్‌లు.. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 07:33 PM IST

ఐతే నెల రోజుల గ్యాప్‌లో వరుసగా రెండుసార్లు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ కావడం.. రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌లో కలపడమో.. పొత్తుతో వెళ్లడమో.. షర్మిల ముందు ఉన్న మార్గాలు ఇవే అనే చర్చ జరుగుతున్న వేళ.. ఆమె వెళ్లి డీకేను కలవడం.. హస్తం పార్టీ వర్గాల్లోనే కాదు.. మొత్తం రాజకీయాన్ని షర్మిల వైపు చూసేలా చేస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు జోష్ మీద ఉంది. కర్నాటకలో ఆ పార్టీ సాధించిన భారీ విజయమే దీనికి కారణం. కర్నాటకలో విజయాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. దానికి తగినట్లు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఐతే షర్మిల వెళ్లి కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ను పదేపదే కలవడం.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. వైఎస్‌ కుటుంబం అనుబంధంతోనే షర్మిల వెళ్లి డీకేను కలిశారని కొందరు అంటున్నా.. దీని వెనక భారీ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌లో లో చేరడమో లేదంటే.. కాంగ్రెస్ పార్టీతో తన పార్టీ పొత్తు ఉండేలా చేసుకోవడమో అన్నది షర్మిల ప్లాన్‌గా కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను ఆమె రంగంలోకి దింపబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ డీకే శివకుమార్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే.. కాంగ్రెస్ నాయకత్వం కూడా అందుకు అంగీకరించే అవకాశాలు ఉంటాయని షర్మిల భావించి ఉండొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయ్.

రోజుల వ్యవధిలోనే డీకేను షర్మిల రెండుసార్లు కలవడం వెనుక అసలు మర్మం కూడా ఇదే కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయ్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే.. అప్పుడు పార్టీలో, తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఐతే ఇదంతా ట్రాష్ అని.. సాధ్యం అయ్యే పని కాదని.. కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.