Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని, వారిని జగన్ రక్షిస్తున్నారని సునీత అన్నారు. ఈ కేసులో తన సోదరుడు జగన్ పాత్రపైనా విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వివేకా హత్యపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని కోరారు.
Jagananna Vidya Divena : జగనన్న విద్యా దీవెన కానుక కార్యక్రమం..
‘‘వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లైనా.. హత్య కేసులో నిందితులెవరో ఇంకా ఎందుకు తెలియడం లేదు. సీబీఐ దర్యాప్తు ఎందుకు త్వరగా పూర్తికావట్లేదు? వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? నాన్నను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసు? ఈ వివరాలన్నీ బయటకు రావాలి. మా నాన్న వివేక హత్య కేసులో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉంది. వాళ్లిద్దరినీ ఏపీ సీఎం జగన్ రక్షిస్తున్నారు. అవినాష్ రెడ్డికి తగిన శిక్ష పడాలి. వాళ్లు వంచన, మోసానికి పాల్పడ్డారు. హత్య తర్వాత మార్చి 15, 2019న మార్చురీ బయట అవినాష్ నా వద్దకు వచ్చారు. రాత్రి 11.30 గంటల వరకు పెదనాన్న తన కోసం ఎన్నికల ప్రచారం చేశారని నాతో చెప్పారు. సినిమాల్లో చూపించే విధంగా హంతకులు మన మధ్యే ఉంటారు. హత్యా రాజకీయాలు ఉండకూడదు. మా అన్న పార్టీ వైసీపీకి ఓటేయొద్దు. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే ఇంకా కష్టాలే. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు.
జగన్ పై ఉన్న 11 కేసులు మాదిరిగా వివేక హత్య కేసు కాకూడదు. వివేకా హత్యలో జగన్ పాత్రపైనా విచారణ చేయాలి. ఆయన నిర్దోషి అయితే వదిలేయాలి. ఈ కేసులో తప్పు చేసిన వారు మాత్రం తప్పించుకోకూడదు. సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేం. జగన్‌ను కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు. కానీ, ఒక్కో వాస్తవం బయటకు వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. ఈ హత్య కేసులో బయటకు రాని పేర్లు చాలా ఉన్నాయి. నాలాగే అందరినీ విచారించాలి. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులను గుర్తించాలి. నేను ప్రజల్లోకి వెళ్తా. కేసు సిబిఐకి అప్పగించిన తరువాత నాతోపాటు నా భర్తకు వేధింపులు పెరిగాయి. సిబిఐ పైనా కేసులు పెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు’’ అని సునీత పేర్కొన్నారు.