YSRCP Leaders Comments: చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన వైసీపీ..

తెలుగుదేశం అధినేత, మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ నేతలు మరిన్ని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా సజ్జల, అంబటి దీనిపై స్పందించారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 01:11 PM IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. పూణెలోని ఐటీ శాఖ అధికారులు జీఎస్టీ విషయంలో అనుమానాలు వచ్చి దీనిపై స్పందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన బాబు ఈకేసును పక్కన పెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈరోజు ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై వైసీపీ కీలక నేతలు స్పందించారు. 

సజ్జల కామెంట్స్..

చంద్రబాబు నాయుడుని ఈరోజు ఉదయం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఈ కేసు ఇప్పుడు జరిగింది కాదని గత నాలుగేళ్ల క్రితం నుంచే దర్యాప్తులో ఉందని పేర్కొన్నారు. తప్పు చేసి అరెస్ట్ వరకూ వచ్చే సరికి ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారన్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులు కావని పూణె ఐటీ శాఖ అధికారులు దీనిపై తొలుత స్పందించారని గుర్తు చేశారు. జీఎస్టీ స్కాంలో దీనికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయిని తెలిపారు. ఇందులో మొత్తం పెట్టుబడులు ప్రభుత్వమే పెట్టినట్లు స్పష్టంగా తేలిందని సజ్జల వివరించారు. చంద్రబాబు హయాంలోనే ఈ విజల్ బ్లోయర్ స్కాంకు పాల్పడినట్లు సీఐడీ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విచారణ ఇప్పటికిప్పుడు జరుగుతున్నాది కాదని రెండేళ్ల నుంచి సీఐడీ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టారని వివరించారు. డబ్బులు ఎటునుంచి ఎటువైపుకు మళ్ళించారు అనే వివరాలు తెలుసుకునేందుకు ఇంత సమయం పట్టిందన్నారు. కరుణానిధిలాగా అర్థరాత్రి అన్యాయంగా అరెస్ట్ చేయలేదని తెలిపారు.

అంబటి రాంబాబు స్పందన..

రాష్ట్ర రాజకీయాల్లో ఇంతటి సీనియర్ నాయకులు అరెస్ట్ కావడం చాలా దురదృష్టకరం అని.. ఇది అక్రమ అరెస్ట్ కాదని అనివార్యమైన అరెస్ట్ అని అంబటి కితాబిచ్చారు. చంద్రబాబు అరెస్ట్ పై ఎల్లో మీడియా అతనికి సింపతీ వచ్చేలా ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదని ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ఒక స్కాం లో వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని తన జేబులో వేసుకున్న వారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. ఒక వేళ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే మనం రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయని వరౌతామన్నారు. రాజకీయంగా ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలని మనవి చేశారు. 2014 లో అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక వందల వేల కోట్లు అవినీతికి పాల్పడేలా చాలా స్కాంలు చేశారని ఆరోపించారు. ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి రింగురోడ్డు డైవర్షన్ స్కాం, అసైన్డ్ భూములు బదలాయింపులు, భవన నిర్మాణాల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అందులో భాగంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో ఈరోజు బాబుని అరెస్ట్ చేశారని తెలిపారు. మిగిలిన వాటిపై కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతోందన్నారు.

జోగి రమేష్..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎప్పుడో అరెస్టు కావల్సిఉందని మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇన్నాళ్లకు చంద్రబాబు నాయుడు అవినీతి పాపం పడిందన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన కారకుడిగా ఉన్నారని తెలిపారు. 371 కోట్ల రూపాయల ప్రజల డబ్బులు అప్పనంగా మింగేశారని ఆరోపించారు. సిమెన్స్ అనే కంపెనీలో 3000 రూపాయలు కోట్లు పెట్టుబడి పెడతానని మాయమాటలు చెప్పారన్నారు. సూట్ కేసు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి హవాలా మార్గం ద్వారా తిరిగి ప్రజల డబ్బును కొట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం దొడ్డి దారిన తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన కుంభకోణం బయటపడి ఈరోజు అరెస్టు అయ్యాడన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ రాష్ట్రానికి శుభ పరిమాణం అంటూ వ్యాఖ్యానించారు. ఇన్ని వందల, వేల కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్న చంద్రబాబు అరెస్ట్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుందన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..

చంద్రబాబు అరెస్ట పై తనదైన శైలిలో స్పందించారు పెద్దిరెడ్డి. అనుభవం ఉంటే అరెస్టు చేయకూడదా? అని ప్రశ్నించారు.  స్కిల్ పేరుతో.. రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు అంటూ విమర్శించారు. హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయని ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారన్నారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ.. ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది.? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా చంద్రబాబు స్కామ్ కి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయన్నారు. షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారని తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని దొచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగినట్లు గుర్తించామన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసిందని చెప్పారు.

కారుమూరి నాగేశ్వర్ రావు..

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎలాంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రమేయంలేకుండా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు కారుమూరి నాగేశ్వర్ రావు ఆరోపించారు. జర్మన్ కంపెనీ 3 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెప్పి ప్రభుత్వం 10శాతం పెట్టుబడులు పెడితేచాలని మాయమాటలు చెప్పి ఏపీ ప్రజలను మోసం చేసినట్ల తెలిపారు.  సెల్ కంపెనీల ద్వారా హవాలా లావాదేవీలు జరిపి నేరుగా చంద్రబాబు అనుచరుల ఖాతాలోకి డబ్బులు మళ్లించారని వివరించారు. ఏపీ సెక్రటరేట్ అధికారులు ఇలా చేయకూడదని ఎంత చెప్పినా వారి మాటలు బేఖాతరు చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్ మొత్తానికి ప్రదాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబునాయుడే అని తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు హయాంలోనే ఇలా జరిగినట్లు ఐటీ శాఖ చెప్పినప్పటికీ వాటిపై విచారణ చేపట్టకుండా ఆ ఫైల్ ను పక్కన పడేసినట్లు పేర్కొన్నారు. అధికారులను, వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు.

T.V.SRIKAR