మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యాడు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున యువీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటికే బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఈసారి యువరాజ్ కి టిక్కెట్ ఇవ్వాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ ఈమధ్యే భేటీ అయ్యారు. ఆ తర్వాతే యువీని ఈ స్థానం నుంచి నిలబెట్టాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ (Gurudas pur) నియోజకవర్గంలో గత కొంతకాలంగా సెలబ్రిటీలే పోటీ చేసి గెలుస్తున్నారు. 2019లో నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) గెలిచారు. అంతకుముదు వినోద్ ఖన్నా (Vinod Khanna) నాలుగు సార్లు అంటే 1998, 1999, 2004, 2014లో గెలిచారు. అయితే సన్నీ డియోల్ గెలిచాక… గురుదాస్ పూర్ ని సరిగా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. గత ఏడాది డిసెంబర్ లో ఆ నియోజకవర్గంలో పర్యటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్… సన్నీడియోల్ పై విమర్శలు చేశారు. పెద్ద వాళ్ళని గెలిపిస్తే ఈ నియోజకవర్గంలో కనిపించడం మానేశారు… ఈసారి ఎన్నికల్లో అలాంటి వాళ్ళకి ఓటు వేయొద్దని జనాన్ని కోరారు. తమకు అవకాశం ఇవ్వాలన్నారు.
అంతేకాదు… 2023 సెప్టెంబర్ లో సన్నీడియోల్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు అంతగా పనికిరానని అన్నారు. గదార్ 2 మూవీ సక్సెస్ తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రజత్ శర్మ నిర్వహిస్తున్న ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్న సన్నీడియోల్… నాకు రాజకీయాలు పనికిరావు… మళ్ళీ ఏ ఎన్నికల్లోనూ పోటీచేయను అని చెప్పేశారు. దాంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి బీజేపీ ఈసారి కొత్త అభ్యర్థి వెతుక్కోవాల్సి వచ్చింది.
పంజాబ్ లో కాంగ్రెస్ సీనియర్ నేత, క్రికెటర్ నవజోత్ సింగ్ సిధ్దూ (Nav jyoth singh sidhu) మళ్ళీ బీజేపీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు కూడా వచ్చే వారంలో కమలం పార్టీలో జాయిన్ అవుతున్నారు. సిద్ధూకి పంజాబ్ కాంగ్రెస్ కమిటీతో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఆయన పార్టీతో సంబంధం లేకుండా సొంతంగా ర్యాలీలు నిర్వహించడం, సమావేశాలు పెట్టడంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకే హస్తం పార్టీకి గుడ్ బై కొట్టే ఆలోచనలో ఉన్నారు నవజోత్ సింగ్ సిధూ. బీజేపీ వర్గాలు కూడా ఆయన జాయినింగ్ ను నిర్ధారిస్తున్నాయి. బీజేపీకి మంచి పట్టున్న అమృత్ సర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిధూని బీజేపీ నిలబెట్టే అవకాశాలు ఉన్నాయి.