అదానీ గ్రూప్ టార్గెట్‌గా అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. ఈసారి ఏకంగా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ చైర్ పర్సన్ మాధుబి పురి బచ్‌ని ఈ అంశంలోకి తీసుకొచ్చింది. అదానీ గ్రూప్ మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కొత్త ఇన్వెస్ట్‌గేటివ్ రిపోర్ట్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ పనితీరుపై చర్చకు దారితీసింది.
దీంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. 2023లో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. కృత్రిమంగా షేర్ల విలువను పెంచి లాభపడిందని, స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చినప్పటికీ.. ఆ సమయంలో గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. సుమారు 100 బిలియన్ డాలర్ల మేర నష్టపోయాయి.
అయితే, ఆ తర్వాత తమ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించేందుకు వేగంగా చర్యలు తీసుకున్నారు అదానీ. దీంతో అదానీ గ్రూప్ షేర్లు వేగంగా కోలుకున్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణల ముందు సమయంలోని విలువను దాటి ట్రేడింగ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మరోసారి హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌తో మరోసారి ఇన్వెస్టర్లు ఆందోళనకు గురౌతున్నారు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. 2023 రిపోర్ట్‌ను ఇప్పటి రిపోర్ట్‌తో కంపేర్ చేయలేమని.. ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.