Ayodhya Aarti Pass : అయోధ్య హారతి పాసులు ఉచితం- ఆన్ లైన్లో రెడీ !

అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి చూడాలనుకునే భక్తులకు ఆలయట్రస్టు శుభవార్త చెప్పింది. హారతి పాసులను ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచారు. హారతిలో పాల్గొనడానికి 30 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది.  అందుకే రాబోయే రోజుల కోసం అడ్వాన్స్ గా ఇప్పుడే పాసులు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

  • Written By:
  • Updated On - January 12, 2024 / 11:01 AM IST

Ayodhya Aarti Pass : అయోధ్య రామ మందిరంలో శ్రీ సీతారామ చంద్రుల వారి ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 జనవరి 22న ఘనంగా జరగబోతుంది.  ఈ ఆలయ సముదాయం నిర్మాణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు ఇప్పటికే భారీగా అయోధ్యకు చేరుకుంటున్నారు. నగరంలో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.  రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నుండి తీసుకువచ్చిన మక్రానా మార్బుల్ రాళ్ళతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన రాళ్ళను ఆలయ నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన విమానాశ్రయంతో పాటు రైల్వే స్టేషన్‌లోని కొత్త టెర్మినల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యకు వస్తున్నారు.

జనవరి 22న జరిగే పవిత్రోత్సవానికి దాదాపు 8 వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రామాలయం ఆవరణలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాల స్కానింగ్ పరికరాలు, రోడ్లపై బ్యారియర్లు పెట్టారు. వాహనాల్లో ఏవైనా నిషేధిత వస్తువులు తీసుకెళితే గుర్తించేలా  టెక్నాలజీని కూడా వాడుతున్నారు. భక్తులు తమ వస్తువులను భద్రపరుచుకోడానికి ఆలయ పరిసరాల్లో లాకర్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. 700కు పైగా లాకర్లు రెడీ చేశారు.  సీసీ కెమెరాల నిఘా పెట్టారు. లగేజీలు దాచుకోడానికి కూడా సెంటర్లను ఏర్పాటు చేసింది ట్రస్ట్.

హారతి కార్యక్రమానికి ఆన్ లైన్లో పాసులు

అయోధ్య రామాలయంలో హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తోంది ఆలయ ట్రస్టు. ఇప్పటిదాకా కౌంటర్ల దగ్గర జారీ చేస్తున్న పాసులను ఆన్​లైన్​లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రారంభోత్సవం తర్వాత నుంచి రోజుకు మూడు పూటలు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఉచితంగానే ఈ పాసులను అందిస్తున్నారు. హారతి కార్యక్రమానికి 30 మంది భక్తులకే అనుమతి ఉంటుంది.

రామజన్మభూమిలో రోజుకు మూడుసార్లు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం శృంగార హారతి, మధ్యాహ్నం భోగ హారతి, సాయంత్రం సంధ్యా హారతి జరుగుతుంది. పాసులు తీసుకున్న 30 మందికి మాత్రమే హారతి కార్యక్రమం చూడటానికి అవకాశం ఇస్తారు. ఆన్​లైన్​లోనూ ఈ సేవ అందుబాటులో ఉంటుంది. రామజన్మభూమి అధికార వెబ్​సైట్​లో హారతి పాసు కోసం అప్లయ్ చేయొచ్చు. ఆన్​లైన్​లో ధరఖాస్తు చేశాక అయోధ్యకు వెళ్ళినప్పుడు అక్కడి సెంటర్లలో పాసులు తీసుకొని హారతి కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆలయ ట్రస్ట్ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం అయితే సెక్యూరిటీ కారణాలతోనే 30 మందికి అనుమతి ఇస్తున్నారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది అవకాశం ఇస్తామంటున్నారు. ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్​పోర్ట్​లో ఏదైనా చూపించి పాసులు తీసుకోవచ్చు. ఆన్​లైన్​లో మాత్రం 20 చొప్పున పాసులు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన డేట్స్ ముందే బుక్ చేసుకోవచ్చు.