Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట.. రామ మందిరం ప్రారంభం కోసం ప్రపంచవ్యాప్తంగా హిందువులంతా ఎదురు చూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. ఇందుకోసం ఆయన 11 రోజుల పాటు ఉపవాస దీక్ష కూడా మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఆ రోజు సెలవు ప్రకటించింది. 45శాతం దాకా హిందూ జనాభా ఉన్న మారిషస్ ప్రభుత్వం కూడా ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రత్యేక సెలవు ప్రకటించింది. అయితే జనవరి 22నే రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎందుకు జరుగుతోంది..? ఆ రోజులో ఉన్న శుభగడియలు ఏంటి..?
TDP-JANASENA: ఎందుకు ఆగారంటే..! సర్దుబాటు ఎందుకు ఆగింది..?
జనవరి 22నాడు అయోధ్యలోని మందిరంలో సీతారామచంద్రుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు పండితులు. ఆ రోజు మృగశిర నక్షత్రం ఉంది. రాముడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. మానవ జన్మను ఉద్దరించడానికి విష్ణు భగవానుడు.. రాముడి అవతారంలో భూమ్మీదకు వచ్చారన్నది అందరికీ తెలిసిందే. ఈ మృగశిర నక్షత్రానికి.. సోమ దేవతతో కూడా అనుబంధం ఉంది. సోమ దేవతను అమరత్వం గల దేవుడని అంటారు. ఈ రోజు మంచి పని చేస్తే.. అంతా శుభమే కలుగుతుందని నమ్ముతారు. మృగశిర నక్షత్రంలో సవర్త సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం కూడా ఉన్నాయి. అందుకే జనవరి 22 నాడు పవిత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు. ఆ ముహూర్తం 22నాడు మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుంచి నుంచి 12 గంటల 59 నిమిషాల దాకా ఉంది. అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని చెబుతుంటారు.
శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైంది. 22 నాడు శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టకు ముందు.. గంట పాటు అగ్నియాగం, హవన, నాలుగు వేదాల పారాయణం, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకూ ఉన్న సమయంలోనే రాములవారి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ఈ 84 సెకన్ల సమయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ సమయంలో ప్రాణ ప్రతిష్టం చేయడం దేశానికి కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. రామ్ లల్లా ప్రతిష్టాపన తర్వాత మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని ఆరోజు అన్ని టీవీల్లో, సోషల్ మీడియాలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కార్యక్రమం అంతా అయ్యాక మీ ఇంటికి ఇప్పటికే చేరిన అయోధ్య అక్షింతలను.. మీరు, మీ కుటుంబ సభ్యులు నెత్తిమీద చల్లుకొని.. సీతారాముల వారికి దండం పెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు.