Jayalalitha: ఆరు ట్రంకు పెట్టెల్లో జయలలిత నగలు.. ఎవరికో తేల్చేసిన కర్ణాటక కోర్టు..

అక్రమాస్తుల కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి బంగారు, వజ్రాభరణాలు, చీరలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో మొత్తం 27 కేజీల బంగారు, వజ్రాభరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండి ఉంది.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 02:25 PM IST

Jayalalitha: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాల కేసులో కర్ణాటకలోని బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు, వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు నిర్ణయించింది. మార్చి 6, 7 తేదీల్లో జయలలిత ఆభరణాలను తీసుకెళ్లడానికి 6 ట్రంకు పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

BRS-BJP: రేవంత్ నెత్తిన బాంబ్.. ఆ కేసుతో రేవంత్‌కు షాక్ ! బీజేపీ, బీఆర్ఎస్ మాస్టర్ స్ట్రోక్

అక్రమాస్తుల కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి బంగారు, వజ్రాభరణాలు, చీరలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిలో మొత్తం 27 కేజీల బంగారు, వజ్రాభరణాలతో పాటు, 700 కేజీలకుపైనే వెండి ఉంది. అలాగే 740 రకాల ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11వేలకుపైగా పట్టు చీరలు, 1040 వీడియో క్యాసెట్లు, 10 టీవీ సెట్లు, 1 వీడియో కెమెరా, 250 శాలువాలు, 2 ఆడియో డెక్‌లు, 12 రిఫ్రిజిరేటర్లు, 8 వీసీఆర్‌లు, 4 సీడీ ప్లేయర్లు, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అక్రమాస్తుల కేసులో జయ దోషిగా తేలడంతో 2014లో బెంగళూరు కోర్టు ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం వేయాలని నిర్ణయించింది. తర్వాత కొంతకాలానికే జయలలిత మరణించారు.

దీంతో ఈ అక్రమ ఆస్తులపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేయడమే ప్రత్యేక కోర్టు ప్రస్తుత విచారణలో ఉంది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6,7 తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు. బంగారు ఆభరణాలను ఈ రెండు తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. వీటిని తీసుకెళ్లే విషయంలో తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని కోర్టు సూచించింది. అలాగే.. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో రావాలని ఆదేశించింది.