ASSEMBELY ELECTIONS: ఉచిత పథకాలకు దూరంగా ఉంటామని నిత్యం ప్రకటించుకునే బీజేపీ.. అప్పుడప్పుడూ మాట తప్పుతుంది. ఇతర పార్టీల్లాగే కొన్ని ఉచిత పథకాల్ని ప్రకటిస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత పథకాల హామీ ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి.. బీజేపీకి దూరం చేసింది. దీంతో బీజేపీ కూడా నెమ్మదిగా ఉచిత పథకాల్ని ప్రకటిస్తోంది. తాజాగా చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాజాగా చత్తీస్‌గడ్‌లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇందులో పలు ఉచిత పథకాల్ని ప్రకటించారు. పెళ్లైన మహిళలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అలాగే పేద కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, క్వింటాలుకు రూ.3,100 చొప్పున ధాన్యానికి మద్దతు ధర, ప్రధాన నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక ప్రకటించింది బీజేపీ. 20 ప్రధాన హామీలను అమిత్ షా ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. చత్తీస్‌గడ్‌ను పూర్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఉచిత పథకాల్ని ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మళ్లీ అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ఆశిస్తోంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం భూపేష్ బఘేల్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. చత్తీస్‌గడ్‌లో ఈ నెలలోనే రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సున్నితమైన రాష్ట్రం కావడంతో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నెల 7, 17 తేదీల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.