విమానాల్లో బాంబు అంత ఈజీనా…? విమానయాన సంస్థల భయం ఏంటీ…?

ఇండియన్ ఎయిర్ లైన్స్ వెన్నులో ఏదో తెలియని భయం... ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రయాణంగా పేరొందిన గగనతల ప్రయాణం అంటే ప్రజల్లో తెలియని ఆందోళన. బుధవారం అంటే అక్టోబర్ 16న ఒక్క రోజే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - October 20, 2024 / 06:54 PM IST

ఇండియన్ ఎయిర్ లైన్స్ వెన్నులో ఏదో తెలియని భయం… ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రయాణంగా పేరొందిన గగనతల ప్రయాణం అంటే ప్రజల్లో తెలియని ఆందోళన. బుధవారం అంటే అక్టోబర్ 16న ఒక్క రోజే ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో మూడు ఇండిగో విమానాలు ఉన్నాయి. 6E 651 ముంబై నుండి ఢిల్లీకి, 6E 1011 ముంబై నుండి సింగపూర్, మరియు 6E 74 రియాద్ నుండి ముంబైకి ప్రయాణించే విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సోమవారం నుంచి కేవలం నాలుగు రోజుల్లో 19 భారతీయ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

దీనితో విమానాలు ఆలస్యం కావడం లేదా దారి మళ్ళించి ప్రయాణికులు దించడం జరుగుతోంది. బుధవారం బెంగళూరు నగరానికి బయలుదేరిన ఎయిర్ అకాస విమానానికి బాంబు బెదిరింపు రావడంతో రాజధాని ఢిల్లీకి దారి మళ్లించారు. మంగళవారం, సింగపూర్ గగనతలంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఎస్కార్ట్ చేసేందుకు రెండు ఫైటర్ జెట్‌లను పంపింది సింగపూర్ ఎయిర్ ఫోర్స్. దానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ముందుజాగ్రత్త చర్యగా కెనడా విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది.

అకాసా ఎయిర్‌కు చెందిన క్యూపీ 1335 ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరగా… బాంబు బెదిరింపు వచ్చింది. అలాగే మరో రెండు స్పైస్‌ జెట్ విమానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అది ఫేక్ అని తెలియడంతో వెంటనే విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం అంటే అక్టోబర్ 15న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మధురై నుండి సింగపూర్ బయల్దేరగా,.. బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనితో రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ వైమానిక దళం రెండు F-15SG ఫైటర్ జెట్‌లను చాంగీ విమానాశ్రయంలోని రిమోట్ బేకు తీసుకువెళ్లి విమానాలను సేఫ్ ల్యాండింగ్ చేసింది.

విమానయాన రంగంలో ఎంతో అనుభవం ఉన్న భారతీయ విమానయాన సంస్థలు బాంబు బెదిరింపుల విషయంలో ఆందోళన చెందడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా విమాన ప్రయాణం చేసిన ప్రతీ ఒక్కరికి భద్రత గురించి ఓ అవగాహన స్పష్టంగా ఉంటుంది. విమానాశ్రయంలోకి అడుగు పెట్టే దగ్గరి నుంచి విమానం ఎగిరే వరకు ప్రతీ ఒక్కటి అత్యంత సున్నితంగా చెకింగ్ ఉంటుంది. మన దేశంలో దేశీయ, అంతర్జాతీయ పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటిలో ప్రతీ విమానాశ్రయానికి బాంబు థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ ఉంటుంది.

ఏ మాత్రం ముప్పు ఉందనే అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌ లు, అంబులెన్స్ లు, కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు, వైద్యులు ఇలా ప్రతీ ఒక్క విభాగం క్షణాల్లో అందుబాటులో ఉండేలా వ్యవస్థలను తీర్చిదిద్దారు. ఇక ప్రయాణికులు విమానాశ్రయంలోకి అనుమతించే ముందు కేంద్ర బలగాలతో అత్యంత సున్నితంగా చెకింగ్ ఉంటుంది. క్యాబిన్ సామాను, చెక్-ఇన్ సామాను, కార్గోతో పాటు ప్రయాణికులను ఆణువణువూ చెకింగ్ చేస్తారు. వ్యక్తిగతంగా ప్రతీ ప్రయాణికుడ్ని చెకింగ్ చేసిన తర్వాతనే అనుమతిస్తారు.

అలాంటిది ఏకంగా ఓ విమానంలో ఆరు కేజీల ఆర్డీఎక్స్ ఉందని చెప్పడంతో విమానాన్ని దారి మళ్ళించడం ఆశ్చర్యం కలిగించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత దేశంలో భద్రతా ప్రమాణాలు మరింత పెరిగాయి. అందుకే నడుం బెల్ట్ తో పాటుగా చేతికి ఉన్న కడియం కూడా తీసి చెకింగ్ లు చేస్తున్నారు భద్రతా సిబ్బంది. స్ట్రిప్ తో కూడా స్కాన్ చేసే భద్రత దేశంలో అందుబాటులో ఉంది. అలాంటిది బాంబు బెదిరింపు విషయంలో విమానయాన సంస్థలు, భారత విమానయాన రంగం ఎందుకు భయపడుతున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

విమానాలు ఆలస్యం కావడం అనేది ప్రయాణికుల కంటే విమానయాన సంస్థలకు, సెక్యూరిటీ ఏజెన్సీలకు వేలాది డాలర్లు నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాలను నడిపే సంస్థలకు ఇది భారీ నష్టమే. ఇవి కచ్చితంగా బెదిరింపు కాల్స్ మాత్రమే అనేది స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పుడున్న భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తే బాంబులు విమానాల్లో అమర్చడం అనేది అసాధ్యం. క్యాబిన్ బ్యాగేజ్, చెకిన్ బ్యాగేజ్ లో ఏ మాత్రం ప్రమాదకర వస్తువులున్నా సరే అనుమతించరు.

అటు సిబ్బందికి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు ఉంటాయి. ఇక ఈ బెదిరింపు కాల్స్ ఎక్కువగా మైనర్స్ నుంచే రావడం గమనార్హం. చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో బాంబు బెదిరింపు సందేశాలను పోస్ట్ చేసినందుకు గాను అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని డోంగ్రీలోని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి అక్టోబర్ 24 వరకు రిమాండ్‌కు పంపారు. దీనిపై ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చి ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన పని లేదని హామీ ఇచ్చారు. అటు కేంద్ర హోం శాఖ కూడా నివేదిక అడిగింది.