కొత్త చట్టం: ఇక ఆ యూట్యూబ్ చానల్స్ ఆఫీసులపై దాడులు…?

  • Written By:
  • Updated On - August 5, 2024 / 12:25 PM IST

యూట్యూబ్ ఛానల్ ఆఫీసుల మీద పోలీసులు ఎప్పుడైనా రైడ్ చేయొచ్చా…? కెమెరాలు, కంప్యూటర్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చా…? డౌట్ వస్తే ఎవరిని అయినా అరెస్ట్ చేయవచ్చా…? అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఒక కొత్త చట్టం ఇప్పుడు సోషల్ మీడియాలో చెలరేగిపోయే బ్యాచ్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తుంది. ఆ చట్టం ప్రకారం యూట్యూబ్ చానల్స్ ను నిర్వహించే వారు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఊచలు లేక్కపెట్టాల్సిందే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు.

ఆ చట్టం ఇంకా బహిర్గతం చేయలేదు గాని… జాతీయ మీడియా అందులోని అంశాలను బయటపెట్టింది. ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ సహా ఇతర సోషల్ మాధ్యమాల్లో పాపులారిటీ ఉన్న వారు అందరిని డిజిటల్‌ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారని… బిల్లు చట్టరూపం దాల్చిన నెల రోజుల్లోగా… వీరు ప్రభుత్వం వద్ద తమ పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆఫీసు ఉంటే దాని అడ్రస్, అలాగే వారికి వచ్చే ఆదాయ వివరాలు ఇలా అనేక అంశాలు సమర్పించాల్సి ఉంటుంది.

ఒకవేళ ఏదైనా అనుమానం వచ్చినా ఫిర్యాదులు వచ్చినా సరే… ఏ సమాచారం ఇవ్వకుండా వారి ఇళ్ళను గాని, ఆఫీసులను గాని తనిఖీలు చేస్తారు. వారి కంప్యూటర్లు, కెమెరాలు ఏదైనా స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే వారి గురించి ఏదైనా సమాచారం అడిగితే… కేంద్ర ప్రభుత్వానికి మెటా, గూగుల్ వంటి సంస్థలు అందించాల్సి ఉంటుంది. ఆన్‌ లైన్‌ యాడ్‌ నెట్వర్క్ లు గూగుల్‌ యాడ్‌ సెన్స్‌, ఫేస్‌ బుక్‌ ఆడియెన్స్‌ నెట్‌వర్క్‌ ఈ బిల్లు కిందకు రావడంతో యూట్యూబ్ ఆదాయం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బిల్లు వెనుక కేంద్రం ఉద్దేశం మరొకటి అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. యూట్యూబ్ చానల్స్ లేదా సోషల్ మీడియాలో తమను ప్రశ్నించే వారిని కట్టడి చేసేందుకే ఈ బిల్లు తెస్తున్నారని మండిపడుతోంది.