ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన నక్సల్స్ గ్రూపుగా ఉన్న సిపిఐ ఎంఎల్ ఇప్పుడు చీలికలు పేలికలైంది. రకరకాల దెబ్బలు తగిలాక ఇప్పుడు సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా దేశంలోని పలు గ్రూపులను ఐక్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ఖమ్మం జిల్లానే వేదికగా చేసుకోబోతోంది. ముఖ్యమైన మూడు గ్రూపులతో మార్చిలో మీటింగ్‌పెట్టి ఒకే గూటికి చేర్చబోతున్నట్టు తెలిసింది. మహా సభను నిర్వహించి మూడు పార్టీలు ఏకం కానున్నాయి. తెలంగాణలో.. ముఖ్యంగా ఇల్లెందు ఏరియాలో ఇప్పుడు న్యూడెమాక్రసీ రెండు వర్గాలుగా ఉంది. ఆ చీలికల వల్లే.. చివరికి తమ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ.. ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా.. సిన్సియారిటికి మారుపేరుగా ఉన్నా.. చీలికల వల్లే బ్యాలెట్‌పోరులో ఘోరంగా దెబ్బతిన్నట్టు ఆలస్యంగా రియలైజేషన్ వచ్చిందట. 1978 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గంలో ఆరుసార్లు నాటి న్యూడెమాక్రసి.. నేటి ప్రజా పంధా గెలుపొందాయి. దళాలతో ఉంటూనే ప్రజల ఓట్లతో ఇన్ని సార్లు గెలుపొందడం అంటే సాధారణ విషయం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు.
మొదటి సారి ఇల్లెందులో గెలిచిన చాపల ఎర్రయ్య పార్టీ ఫిరాయిస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు గెలిచి నేటికీ పార్టీ కోసం పని చేస్తున్నారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక ఆ పార్టీకి జవసత్వాలు లేకుండాపోయాయి. చీలికలు, పేలికలతో ఇప్పుడు పోటీ చేయడానికి సైతం వెనకంజ వేసే పరిస్థితి వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమెకు ప్రజాపంధా మద్దతు ఇచ్చింది. కానీ.. అనురాధకు వచ్చిన ఓట్లు కేవలం 1382. చీలిన రెండు న్యూడెమోక్రసి గ్రూపులు కలిసి పోటీ చేస్తే వారికి వచ్చిన ఓట్లు 1695. అశ్వారావుపేట, సత్తుపల్లిలో ప్రజా పంధా పోటీ చేసినప్పటికి ఓట్లు మాత్రం రాలలేదు. అంటే ఆ పార్టీ ఎలా దిగజారి పోతోందో అర్ధం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు. స్వరాష్ట్రంలో సీట్లు పోయాయి. ఓట్లు కూడా రావడం లేదు.. ఉన్న పార్టీ చీలికలు పేలికలు అవుతోంది. కానీ దేశంలో ఉన్న నక్సల్స్ గ్రూపు లతో ఐక్యతా రాగం ఆలపిస్తోంది ప్రజాపంధా. మరి అది ఎంత మేరకు ఫలిస్తుందన్న అనుమానాలు ఆ పార్టీలోనే ఉన్నాయట. విలీనం అనే మాట ఆ పార్టీ వర్గాలకు బూస్టింగ్ ఇస్తున్నా దానివల్ల స్వరాష్ర్టంలో ఒరిగేదేమిటి అంటున్నారు.
పిసిసి సీపీఐ ఎంఎల్ ఎనిమిది రాష్ట్రాల్లో ఉంది. ఇకపోతే సీపీఐ ఎంఎల్ రెవల్యూషనరీ పార్టీకి పశ్చిమ బెంగాల్‌తో పాటు హిందీ బెల్ట్‌లో పట్టుంది. తెలంగాణలో పట్టున్న ప్రజాపంధా తరపున నలబై మంది సర్పంచ్ లు గెలిచారు. ఇప్పుుడు వాళ్ళలో ఎక్కువ మంది పార్టీలో లేకున్నా ప్రజాదరణ మాత్రం తగ్గలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతర ఎంఎల్ పార్టీల విలీనం వల్ల ఇక్కడ పెద్దగా మార్పు ఉండబోదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉందట. కానీ.. గతంలో వివిధ నక్సల్ గ్రూప్‌లను ఏకం చేశాకే మావోయిస్ట్ పార్టీ బలపడిందని, అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని వాదింంచే వాళ్ళు ఉన్నారు. మరి ఎంఎల్ గ్రూపుల విలీనం తర్వాత ప్రజాపంథాకు ఎలాంటి స్థానం దక్కుతుందో, ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి.