Supreme Court on Electoral Bonds: రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాలి…SBIకి సుప్రీం ఆదేశాలు

ఎన్నికల బాండ్ల(Electoral Bonds) వివరాల వెల్లడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాలను రేపు బ్యాంకు టైమ్ అయ్యేలోగా రిలీజ్ చేయాలని ఆదేశించింది.

ఎన్నికల బాండ్ల(Electoral Bonds) వివరాల వెల్లడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆ వివరాలను రేపు బ్యాంకు టైమ్ అయ్యేలోగా రిలీజ్ చేయాలని ఆదేశించింది. అదనపు టైమ్ కావాలని కోరిన SBI లాయర్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది.

ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టడానికి తమకు అదనపు సమయం కావాలని భారతీయ స్టేట్‌ బ్యాంకు (SBI) చేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్చి 12లోగా విరాళాల వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా వెబ్ సైట్ లో పబ్లిష్ చేయాలని కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ను సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడికి జూన్‌ 30 దాకా టైమ్ ఇవ్వాలని SBI దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ విచారణ జరిపింది.

రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించే ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. వాటి ద్వారా పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని SBIని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చిన దాతలు, వీటిని తీసుకున్న వారి వివరాలు వేర్వేరు చోట్ల ఉన్నాయనీ… వాటిని మ్యాచ్‌ చేసి వివరాలను ఇవ్వడానికి కొంత టైమ్ పడుతుందని SBI తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. SBI తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విరాళాల వివరాలు చెప్పాలని ఆదేశించితే మళ్ళీ టైమ్ ఎందుకు అడుగుతున్నారు. విరాళాలు ఎవరు, ఏ పార్టీకి ఇచ్చారో చెప్పడానికి మ్యాచ్‌ చేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ఎన్ని బాండ్లను జారీ చేశారన్న వివరాలను ఉన్నది ఉన్నట్లుగా ఈసీకి ఇవ్వమని ఆదేశించాం. తీర్పు వచ్చి 26 రోజులుగా మీరు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు న్యాయమూర్తులు. మార్చి 12 సాయంత్రం బ్యాంక్ అవర్స్ ముగిసే లోపు దాతల వివరాలు మీరు ఈసీకి ఇవ్వాల్సిందే అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఆ వివరాలను వెబ్ సైట్ లో పబ్లిష్ చేయాలని ఈసీకి సూచించింది.

సార్వత్రిక ఎన్నికల ముందు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు బయటపెట్టకుండా SBI పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ బాండ్స్ తో బీజేపీకి వందల కోట్ల రూపాయలు వచ్చాయని వాదిస్తున్నాయి. సుప్రీంకోర్టు కోర్టు కూడా ఖచ్చితంగా వివరాలను వెల్లడించాల్సిందేనని తీర్పు చెప్పడంతో అధికార బీజేపీకి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నారు.