ఉద్యోగం లేదు… నాకు ఎలాంటి ఆదాయం రాదు… అందుకే విడాకులిచ్చిన భార్యకు మనోవర్తి ఇచ్చుకునే పరిస్థితి లేదంటూ… భర్త చెప్పడం కరెక్ట్ కాదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యకు భరణం చెల్లించడం అనేది భర్త విధి అని తెలిపింది. కూలీ నాలీ చేసైనా సరే… ఆమెకు మనోవర్తి ఇవ్వాల్సిందేనని ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు లఖ్నవూ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ రేణు అగర్వాల్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యంగానే ఉన్నావ్… అందుకే కూలీ పనులు చేసైనా సరే… రోజుకి రూ.300-400 సంపాదించుకోవచ్చు… అందులో నెలకు భార్యకు 2 వేలు ఇవ్వాలని ఆదేశించింది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ జంటకు 2015లో పెళ్ళి జరిగింది. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ 2016లోనే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రతి నెలా మనోవర్తి ఇవ్వాలని భర్తను ఆదేశించింది. కానీ అతను మనోవర్తి కింద ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో భార్య హైకోర్టును ఆశ్రయించింది. భర్త మాత్రం తనకు కొంచె భూమి మాత్రమే ఉందనీ.. కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నానని కోర్టుకు చెప్పాడు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ల బాధ్యతలను చూసుకోవాలి తెలిపాడు. తన భార్య ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ నెలకు 10 వేలు సంపాదిస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు భర్త. ఈ వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు. ఆమె టీచరుగా చేస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావ్ కదా… రోజువారీ కూలీ పనులైనా చేసి సంపాదించి… దాని నుంచి భరణం ఇవ్వాలని అలహాబాద్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.