రఘునందన్ రావు, ఈటల రాజేందర్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతలే. ఇద్దరూ ఈ సారి ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తమకు బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు.
2020 దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ ఈసారి ఓడిపోయారు. ఇక ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. హుజురాబాద్‌తో పాటు గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ మీద కూడా పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఫలితాల తర్వాత నిరాశగా ఉన్న ఇద్దరు నాయకులు.. రాబోయే లోక్‌సభ ఎన్నికల మీద ఫోకస్ చేసినట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇద్దరూ మెదక్ లోక్‌సభ సీటు మీద కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ సీటు పరిధిలో మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఈ అన్ని నియోజకవర్గాల్లో కమలం పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం ఇద్దరూ ఎంపీ సీటు ఆశిస్తూ.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్టు మాట్లాడుకుంటున్నాయి బీజేపీ వర్గాలు.
రఘునందన్‌రావు ఇప్పటికే పార్లమెంట్ సీటు పరిధిలో ఉన్న ముఖ్య నాయకులకు ఫోన్ చేసి ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నాననీ, మీ సహకారం కావాలని అడుగుతున్నారట. ఇక ఈటల మొదట కరీంనగర్ ఎంపీగా పోటీ చేద్దామనుకున్నా అక్కడ బండి సంజయ్ ఉండటంతో అవకాశం రాదని ఫిక్స్ అయ్యారట. తర్వాత వరంగల్ సీటును పరిశీలించినా అది ఎస్సీ రిజర్వుడు కావడంతో.. తిరిగి తిరిగి మెదక్‌నే ఎంచుకున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. తాను పోటీ చేసి ఓడిపోయిన గజ్వేల్ కూడా మెదక్ పార్లమెంటు పరిధిలోనే ఉండటం, ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగా ఉండటం లాంటి లెక్కలేసుకుంటున్నారట రాజేందర్. దీంతో.. ఇప్పుడు మెదక్ ఎంపీ టిక్కెట్ విషయమై బీజేపీలో ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ అధిష్టానం వీళ్లిద్దరిలో ఎవరికైనా ఇస్తుందా? లేక పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు వేరెవరైనా సీన్‌లోకి వస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది.