తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్‌గా వచ్చాయి. దశాబ్దకాలం తర్వాత అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ కేడర్ యమా జోష్ మీదుంది. అదే సమయంలో.. వాళ్ళతో సమానంగా, ఇంకా చెప్పాలంటే.. కొంచెం ఎక్కువ సమానంగా ఉత్సాహపడుతోందట ఏపీ టీడీపీ కేడర్. గెలిచింది కాంగ్రెస్సే అయినా.. అందులో తమను చూసుకుంటూ మురిసిపోతున్నారు ఎక్కువ మంది టీడీపీ లీడర్స్, కేడర్. రకరకాల విశ్లేషణలు, చర్చలతో వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారట. ప్రత్యేకంగా ఎలాంటి మాటలు జరక్కుండానే.. కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ జెండాలు కూడా కనిపించడం, ఇప్పుడు అదే పార్టీ అధికారం చేపట్టబోతుండటంతో పాజిటివ్ సైన్‌గా భావిస్తున్నారట టీడీపీ కార్యకర్తలు.
అలాగే.. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ అన్న మాటలు, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటూ.. అడిగిన వాళ్ళు, అడగని వాళ్ళ దగ్గర చర్చలు పెట్టేస్తున్నారు. కొందరు కిందిస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మీద భారీగా బెట్టింగ్‌లు కాసినట్టు తెలిసింది. ఇప్పుడు వాళ్ళంతా ఖుషీ ఖుషీగా ఉన్నారట. పార్టీ అధ్యక్షుడు సైలెంట్‌గా ఉన్నా.. నాయకుల్లో మాత్రం కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయి. ఏపీలో కూడా సీన్ మారిపోతుందన్నంత బిల్డప్ ఇస్తున్న టీడీపీ నేతల ఉత్సాహాన్ని చూస్తున్న వైసీపీ లీడర్స్ మాత్రం.. అంతొద్దమ్మా.. కాస్త తగ్గాలి అని సలహాలిస్తున్నారు. అక్కడి రాజకీయాలు వేరు, ఇక్కడి రాజకీయాలు వేరు.. కాస్త లోతుల్లోకి వెళితే.. టీడీపీకే ఎక్కువ డ్యామేజ్ అయింది. ముందు ఆ సంగతేంటో చూసుకోండని అంటున్నట్టు తెలిసింది.
Telangana Assembly : అసెంబ్లీ లో ప్రతిపక్ష నేత ఎవరు..?
బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పక్షాన నిలిచింది కోర్ తెలంగాణ మాత్రమే. గ్రామీణ ప్రాంతాలను వదిలేసి జీహెచ్‌ఎంసీ పరిధిలో సీమాంధ్ర ఓటర్లు, అందునా టీడీపీ గొప్పగా చెప్పుకుంటున్న ఐటీ ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారట. గట్టిగా మాట్లాడుకుంటే.. బీఆర్‌ఎస్‌కు వచ్చిన వాటిలో ఎక్కువ సీట్లు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలోనే ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే.. మీరు అనుకుంటున్న వర్గాలన్నీ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నట్టు అర్ధమవుతోందనీ.. అలాంటప్పుడు కాంగ్రెస్ గెలుపు సంబరాలతో మీకేం పని అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
టీడీపీ మిత్రపక్షం జనసేన పరిస్థితిని కూడా చెబుతూ.. వాస్తవానికి, తెలుగుదేశం నేతలు ప్రచారం చేసుకుంటున్నదానికి పొంతన లేదని విశ్లేషిస్తోంది వైసీపీ. ఫలితాలను బట్టి చూస్తుంటే.. టీడీపీ గొప్పగా చెప్పుకుంటున్న వర్గాలన్నీ బీఆర్‌ఎస్‌వైపే ఉన్నట్టు అర్ధమవుతోందని, అలాంటప్పుడు కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు సంబరాలు చేసుకోవడంలో అర్ధం ఏముందని అడుగుతున్నారట వైసీపీ నాయకులు. టీడీపీలోని మరో వర్గం వాదన కూడా డిఫరెంట్‌గానే ఉందంటున్నారు. ఆ ఫలితాలు కేడర్‌లో ఉత్సాహం నింపడానికి పనికొస్తాయి తప్ప.. వాస్తవంగా లెక్కలు చూసుకుంటే తేడా కొడుతోందన్నది ఆ వర్గం అభిప్రాయంగా తెలిసింది.
పార్టీ మీద,చంద్రబాబు మీద అంత సానుకూలతే ఉంటే..
అరెస్ట్ సమయంలో సోషల్ మీడియా పోస్టింగ్స్‌తో ఓ రేంజ్‌లో హంగామా చేసినవాళ్ళు, ర్యాలీలు తీసిన వాళ్ళందరి ఓట్లు ఎక్కడికి పోయాయని అడుగుతోందట టీడీపీలోని ఆ వర్గం. అలాగే మిత్రపక్షం జనసేన 8సీట్లలో పోటీ చేస్తే.. ఏడు చోట్ల డిపాజిట్స్ రాకపోవడాన్ని ఎలా చూడాలని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నది ఆ వాదనను సమర్ధించేవారి అభిప్రాయంగా తెలిసింది. అయితే.. ఖమ్మం సహా చాలాచోట్ల సెటిలర్స్ ఉన్నారని, వాళ్ళందరి ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. కేవలం అర్బన్‌ని ప్రామాణికంగా తీసుకుని ఎలా నిర్ణయానికి వస్తారన్న మరో వాదన కూడా ఉంది. ఇలా.. వైసీపీ, టీడీపీ మధ్య తెలంగాణ ఫలితాలపై రకరకాల వాదనలు, విశ్లేషణలు, చర్చలు నడుస్తున్నాయి. అవి అక్కడితో ఆగుతాయా లేక చర్చలు రచ్చగా మారతాయా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ గెలుపును ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి వారు నచ్చినట్టు అన్వయించుకుంటూ ఆనందపడుతున్నారు.