AP CM YS Jaganmohan Reddy : పోతే పోండి..! నష్టం లేదు..!! అసంతృప్తులపై వైసీపీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ.. వైసీపీలో నేతల అసంతృప్తి రకరకాలుగా బయటపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగాలు ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. సర్వేల పేరుతో ఇప్పటికే 60 మంది దాకా ఎమ్మెల్యేల మార్పు తప్పదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. వాళ్ళల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై గందరగోళం నడుస్తోంది. ఈలోపు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందు జాగ్రత్తగా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. విశాఖ ఎమ్మెల్సీ వంశీ ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. మరికొందరు నేతలు టీడీపీ, జనసేనతో బేరం ఆడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి విశ్వరూప్ కూడా వైసీపీని వీడబోతున్నారన్న సమాచారం పార్టీలో కలకలం రేపుతోంది. మంత్రి విశ్వరూప్ కు ఈసారి టికెట్ ఇవ్వలేమనీ.. కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ కు టికెట్ ఇస్తామని జగన్ చెప్పడంతో అయోమయంలో పడ్డారు విశ్వరూప్.

తనకు 40 శాతం ఓటింగ్ ఉంటే.. శ్రీకాంత్ కు పది శాతం ఓటింగ్ ఉందనీ.. విశ్వరూప్ ఓటు బ్యాంకు ఆయన కొడుక్కి బదిలీ అవుతుంది. అందువల్ల శ్రీకాంత్ గెలిచే అవకాశం ఉందని విశ్వరూప్ కు జగన్ నచ్చ చెప్పినట్లు సమాచారం. 40% ఉన్న తనకు సీటు ఇవ్వకుండా 10 శాతం మాత్రమే ఉన్న తన కుమారుడు శ్రీకాంత్ కు సీట్ ఇస్తానంటూ జగన్ చెప్పడాన్ని విశ్వరూప్ నమ్మడం లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉందనీ.. చివర్లో ఇద్దరికీ జగన్ హ్యాండిచ్చే ఛాన్స్ ఉందని విశ్వరూప్ భయపడుతున్నారు. తన విషయంలో పార్టీ అధిష్టానం మొదటి నుంచి ఇలాగే ప్రవర్తిస్తోందని విశ్వరూప్ సన్నిహితుల దగ్గర వాపోయారట. తన ఇల్లును దుండగులు తగలబెట్టినప్పుడు ఒక్క మంత్రి కూడా వచ్చి పరామర్శించలేదనీ.. ముఖ్యమంత్రి కూడా విదేశాల నుంచి వచ్చాక మాట వరసకైనా పరామర్శించలేదని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టిడిపి నాయకులు విశ్వరూప్ కి టచ్ లోకి వచ్చారు. ఆయన వైసీపీని విడిచిపెట్టడం దాదాపు ఖాయమైంది.

వైసీపీలో 60 సీట్లల్లో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో.. వేరే దారి చూసుకోవడం బెటర్ అని చాలామంది ఎమ్మెల్యేలు, నేతలు భావిస్తున్నారు. ఇప్పుడే టీడీపీ, జనసేన లేదంటే కాంగ్రెస్ లోకి వెళ్ళడం బెటర్ అనుకుంటున్నారు. అయితే అసృంతప్త నేతల బెదిరింపులకు లొంగేది లేదంటోంది అధిష్టానం. వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారని సజ్జల వ్యాఖ్యానించారు. పార్టీ విధానాలు నచ్చనివారు వెళ్ళిపోతారనీ.. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం.. వినకుంటే ఏం చేస్తామని అంటున్నారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా జగన్ మార్పులు జరుగుతున్నాయనీ.. ఎమ్మెల్సీ ఇచ్చినా సంతృప్తి లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు వై.వి. సుబ్బారెడ్డి. అసంతృప్తులు పార్టీ వదిలి వెళ్ళినా నష్టం లేదన్న ధోరణి వైసీపీ అధిష్టానంలో కనిపిస్తోంది.