Telangana BJP : మరక చెరుపుకునే పని లో బీజేపీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నదొక్కటి అయింది ఇంకోటి. అధికారం సంగతి తర్వాత కనీసం కింగ్‌ మేకర్‌ అవుదామన్న ఆశలు సైతం నెరవేరలేదు. కేవలం 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది కాషాయ పార్టీ.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్నదొక్కటి అయింది ఇంకోటి. అధికారం సంగతి తర్వాత కనీసం కింగ్‌ మేకర్‌ అవుదామన్న ఆశలు సైతం నెరవేరలేదు. కేవలం 8 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది కాషాయ పార్టీ. ఫలితాల మీద ఇంకా పార్టీ పరంగా పోస్ట్‌మార్టం కూడా జరగలేదట. అయితే అందులో తేలే కారణాల సంగతి ఎలా ఉన్నా.. ఒక్క దెబ్బ మాత్రం గట్టిగానే పడిందని టాప్‌ టు బాటమ్‌ పార్టీ వర్రాలన్నీ నమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రచారం జనానికి బాగా ఎక్కిందని క్లారిటీకి వచ్చేశారట కాషాయ నేతలు. ఆ ప్రభావం గట్టిగానే ఉందని, అయినా తాము తిప్పి కొట్టలేకపోయామని అనుకుంటున్నట్టు తెలిసింది. చివరికి పార్టీ శ్రేణుల్లో కూడా అనుమానపు బీజాలు పడ్డాయి.. తొలగించి నమ్మకం కలిగించ లేకపోయామని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. బీజేపీ పరంగా చూసుకుంటే… అసెంబ్లీకన్నా లోక్‌సభ సీట్లకే ప్రాధాన్యం ఎక్కువ. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ దెబ్బ రిపీట్‌ అవకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారట తెలంగాణ కమలనాథులు. కానీ.. వాళ్ళు భయపడ్డట్టే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి పోటీచేస్తాయన్న ప్రచారం మొదలైంది. ఆ విషయంలో పార్టీ కేడర్‌ సైతం గందరగోళంలో ఉందట. దీంతో తత్తరపడుతున్న తెలంగాణ కాషాయ పార్టీ.. ఫుల్‌ క్లారిటీ ఇవ్వాలని డిసైడైందట. అలాకాని పక్షంలో దెబ్బ ఘోరంగా పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది.

ఆ విషయంలో ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తమ కార్యాచరణ ఉండాలని అమనుకుంటున్నారట పార్టీ నేతలు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్‌లతో ఇదే విషయమై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎవరితో పొత్తు ఉండదని క్లారిటీగా చెప్పేశారట కిషన్‌. తమకు కాంగ్రెస్ ఎంత దూరమో, బిఆర్ఎస్ కూడా అంతే దూరమని, ఇప్పటి నుంచే కష్టపడి పనిచేసి గతంలోకంటే ఎక్కువ లోక్‌సభ సీట్లు గెల్చుకోవాలని హితబోధ చేసినట్టు తెలిసింది. కేవలం ఇంటర్నల్‌గా చెప్పుకోవడమే కాకుండా పొలిటికల్‌ కౌంటర్స్‌ కూడా మొదలుపెట్టింది కాషాయ దళం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని స్టేట్‌మెంట్స్‌ ఇస్తోంది. అందుకు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలను ఉదాహరణగా చెప్తున్నారు పార్టీ నేతలు. ప్రొటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడమే అందుకు సంకేతమంటున్నారు బీజేపీ నేతలు. మొత్తానికి మరక చెరిపేసుకునే పనిలో సీరియస్‌గా ఉన్నారట కమలం పార్టీ నాయకులు. లోక్‌సభ ఎన్నికలు ఎంతో దూరం లేనందున పాత ప్రచారం అలాగే కొనసాగితే దెబ్బతినక తప్పదన్న అంచనాతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. మరి జనంలోకి బలంగా వెళ్లి ప్రచారాన్ని ఎంత త్వరగా, ఎలాంటి సీరియస్‌నెస్‌తో కౌంటర్‌ చేసుకుంటారో చూడాలి.