INDIA: ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తుందా..? ఎన్డీయేను ఢీకొట్టగలదా..?

కూటమిలోని పార్టీల మధ్య ఎన్ని విబేధాలు తలెత్తినా కనీసం 400 స్థానాల్లో కలిసిపోటీ చేస్తామని, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా తెలిపారు. త్వరగా ఇండియా పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 08:28 PM IST

INDIA: సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు, నాలుగు నెలల సమయమే ఉంది. ఈ లోపే అధికార బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే, ప్రతిపక్షాల కూటమి ఇండియా.. పోటీకి సిద్ధమవ్వాలి. బీజేపీ ఈ విషయంలో కాన్ఫిడెన్స్‌గానే ఉంది. అయితే, ప్రతిపక్షాల ఇండియా కూటమి సంగతే తేలడం లేదు. కూటమిలోని పార్టీలన్నీ అంగీకరిస్తేనే కలిసి పోటీ చేసే ఛాన్స్ ఉంది. లేకపోతే.. ఎవరికి వాళ్లే.. పోటీ చేసి, ఫలితాల తర్వాత కూటమిగా ఏర్పడొచ్చు. కొన్ని చోట్ల మాత్రం స్థానికంగా పొత్తులుండొచ్చు.

REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..

దీనివల్ల బీజేపీకే లాభం. అందువల్ల కలిసి పోటీ చేసే అంశంపై ఇండియా కూటమి ఆలోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కలిసి పోటీ చేసేందుకు ఇండియా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిలోని పార్టీల మధ్య ఎన్ని విబేధాలు తలెత్తినా కనీసం 400 స్థానాల్లో కలిసిపోటీ చేస్తామని, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా తెలిపారు. త్వరగా ఇండియా పార్టీలు సీట్లు సర్దుబాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కలిసి పోటీ చేస్తే ఎన్డీయేకు గట్టి పోటీ ఇవ్వగలమని, ఒకరినొకరు గౌరవించుకుంటూ.. తగిన ప్రాధాన్యం ఇచ్చుకోవాలని ఆయన అన్నారు. కూటమిలో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్.. సీట్ల సర్దుబాటు విషయంలో ముందుండి నడిపించాలని జేడీయూ కోరింది.

ఇతర పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలని జేడీయూ సూచించింది. గతంలో సీట్ల పంపకాలపై చర్చలు జరిగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెలలోనే సీట్ల సర్దుబాటుపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకోవాలని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఈ నెల రెండో వారంలోగా సీట్ల సర్దుబాటుపై చర్చిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కలిసి పోటీ చేస్తేనే ఇండియా కూటమికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.