Ayodhya Sri Rama : రాముడి ఫోటోలు తీయడం దోషమా..? తెర తీసేయడంపై పూజారుల ఆగ్రహం

అయోధ్యలోని శ్రీరామ మందిరం (Ayodhya Ram Mandir)లో కొలువైన బాల రాముడి (Bala Rama) ఫోటోలను ముందుగానే లీక్ చేయడంపై ట్రస్ట్ అసహనం వ్యక్తం చేస్తోంది.

అయోధ్యలోని శ్రీరామ మందిరం (Ayodhya Ram Mandir)లో కొలువైన బాల రాముడి (Bala Rama) ఫోటోలను ముందుగానే లీక్ చేయడంపై ట్రస్ట్ అసహనం వ్యక్తం చేస్తోంది. రెండు రోజులుగా అయోధ్య రామ్ లల్లా విగ్రహాలు వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రాణప్రతిష్ట (Ayodhya Pranapratistha) తర్వాత మాత్రమే ఈ ఫోటోలను బయటకు విడుదల చేస్తారు. అంతకంటే ముందే రిలీజ్ కావడంపై రామమందిరం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

శ్రీరామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని నిలబెట్టిన తర్వాత కొన్ని గంటలకే ఆయన కళ్ళకు ఉన్న తెరను కొంత మంది తొలగించి.. ఫోటోలు తీశారు. ఆ ఫోటోలను బయటకు రిలీజ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. కానీ ప్రాణ ప్రతిష్ట జరగక ముందే ఆ తెరను తొలగించడం తప్పు అంటున్నారు రామ మందిరం పూజారులు. అది దోషం అని కూడా అంటున్నారు. ముందగా విగ్రహం మొత్తం కూడా గుడ్డతోనే కప్పి ఉంచాలి. ప్రాణ ప్రతిష్ట అయ్యాకే దాన్ని తొలగించాలి. కానీ ప్రస్తుతం బాల రాముడి కళ్ళకు ఉన్న తెరను తొలగించడమే కాకుండా విగ్రహం మొత్తం కనిపించేలా ఫోటోలు తీయడం తప్పు అంటున్నారు రామమందిరం (Rama Mandir) ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్. ఈ తప్పు ఎలా జరిగిందో.. కచ్చితంగా విచారణ చేపడతామని చెప్పారు.

ప్రస్తుతం అయోధ్య శ్రీరామమందిరంలోని గర్భగుడిలో.. కృష్ణ శిలతో చేసిన 5 అడుగుల పొడవు ఉన్న బాలరాముడు కొలువై ఉన్నాడు. చేతిలో బంగారు విల్లు, బాణం పట్టుకొని ఉన్న బాలరాముడు.. పీఠంపై నిలబడి ఉన్నట్టుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఈ బాల రాముడి విగ్రహం 150 కిలోల దాకా ఉంటుంది. ఐదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు శ్రీరాముడు ఎలా ఉండేవాడో.. ఈ విగ్రహం చూస్తే అర్థమవుతుంది. మైసూర్ కు చెందిన అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) చెక్కిన శిల్పాన్ని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది. ఈ రామ్ లల్లా విగ్రహానికి ఈనెల 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు. ఆ మధుర క్షణాల కోసం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదురు చూస్తున్నారు.