ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ (Kerala) లో ఇప్పుడు అదే ప్రకృతి విపత్తుతో (Natural disaster) మరణ మృదంగం మోగుతోంది. దేశం మొత్తం కేరళ ఈ విపత్తు నుంచి బయటకు రావాలని ప్రార్ధిస్తోంది. కేరళ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా వేగంగా చర్యలు చేపడుతూ బాధితులకు సహాయం చేస్తూ, బురదలో, రాళ్ళ కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్నారు. దాదాపుగా 220 మృతదేహాలను వెలుగు తీయగా మిగిలిన మృతదేహాలు (dead bodies), ఆచూకి తెలియని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కేరళలో స్వచ్చంద సహాయ బృందాలు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా వాయనాడ్ (Wayanad) కు లోక్సభ విపక్ష నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (MP Rahul Gandhi) తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి విపత్తు సంభవించిన ప్రాంతాల్లో పర్యటించారు. వాయనాడ్ జిల్లాలోని మెప్పాడిలో కొండచరియలు విరిగిపడిన బాధితుల సహాయ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక చిన్న పిల్లలను, గాయాలైన వారిని పలకరించి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు రాహుల్. “మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎలా భావించానో ఇప్పుడు నేను అలాగే భావిస్తున్నాను. ఇక్కడి ప్రజలు వారి తండ్రిని మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులలో చాలా మందిని కోల్పోయారు. అందుకే వారి బాధ నేను అనుభవించిన దానికంటే తీవ్రంగా ఉంటుంది. కోల్పోయిన వ్యక్తులతో మాట్లాడటం చాలా కష్టం. చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు అంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేసారు. ఇక బాధిత ప్రాంతాలకు స్వయంగా కాలి నడకన వెళ్లి రాహుల్, ప్రియాంక ఇద్దరూ పర్యటించారు.
ఇది యావత్ దేశానికి తీరని విషాదం. ప్రాణాలతో బయటపడిన వారికి సక్రమంగా పునరావాసం కల్పించాలి, ఇది జాతీయ విపత్తుగా తాను భావిస్తున్నాని రాహుల్ అన్నారు. 2019 లో వాయనాడ్ నుంచి ఎంపీగా రాహుల్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే తన తల్లి పోటీ చేసిన రాయబరేలి స్థానాన్ని గాంధీ కుటుంబమే నిలబెట్టుకోవాలని మళ్ళీ అక్కడ ఆయన పోటీ చేసి విజయం సాధించారు. వాయనాడ్ స్థానానికి రాహుల్ రాజీనామా చేయడంతో ఏర్పడే ఖాళీకి జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.