కోల్‌కతా డాక్టర్‌ విచారణ.. 1973దారుణం గుర్తుచేసిన సుప్రీం.. ఎవరీ అరుణ షాన్‌బాగ్‌?

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్... 1973 అరుణ షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. దీంతో ఎవరీ షాన్‌బాగ్.. ఈ కేసును ఎందుకు ప్రస్తావించారు అనే చర్చ మొదలైంది.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 03:15 PM IST

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్… 1973 అరుణ షాన్‌బాగ్ సంఘటనను ప్రస్తావించారు. దీంతో ఎవరీ షాన్‌బాగ్.. ఈ కేసును ఎందుకు ప్రస్తావించారు అనే చర్చ మొదలైంది. ఐతే అది అలాంటి ఇలాంటి దారుణం కాదు.. భయం కూడా భయపడేంత దారుణం.. తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టేంత ఘోరం.. మహిళ మీద దాడి అనే చర్చ మొదలైన ప్రతీసారి గుర్తొచ్చే విషాదం.

అరుణా షాన్‌బాగ్‌ అనే నర్సు.. ముంబైలోని KEM ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో పనిచేసేది. ఓ డాక్టర్‌తో పెళ్లికి సిద్ధమైంది. భవిష్యత్ గురించి ఎన్నో కలలు కనేది. కానీ ఒక్క రాత్రి.. ఆమె కలను ఛిద్రం చేసింది. బతుకునే మార్చేసింది. బతికున్న శవంలా చేసింది. 1973, న‌వంబ‌ర్ 27న.. అరుణ షాన్‌బాగ్‌పై వార్డు అటెండెంట్ సోహాన్‌ పైశాచికంగా దాడి చేశాడు. రూమ్‌కి వెళ్లేందుకు బేస్‌మెంట్‌లోని ఓ గదిలో షాన్‌బాగ్‌ బట్టలు మార్చుకుంటోంది. ఆ సమయంలో సోహన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించడంతో కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. పశువులా ప్రవర్తించి పారిపోయాడు.

అతడి దాడితో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అరుణ అక్కడికక్కడే కుప్పకూలింది. కోమాలోకి వెళ్లిపోయింది. వెన్నెముక కూడా దెబ్బతింది. అప్పట్నుంచి అచేతనంగానే ఉండిపోయింది. సోహన్‌లాల్ పోలీసులకు చిక్కాడు. దోషిగా తేలాడు. అత్యాచారం కేసు కింద అతడిని శిక్షించలేదు. ఈ హేయమైన రాక్షస క్రీడను దొంగతనం, దాడిగానే చూసింది కోర్టు. ఒక్కో కేసులో ఏడేళ్ల శిక్ష విధించాయి. ఆ శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు చెప్పడంతో కేవలం ఏడేళ్ల శిక్ష అనుభవించి సోహన్‌లాల్ బయటకొచ్చాడు.

ఒంటి నిండా పుండ్లు, కదల్లేని అవయవాలతో KEM ఆసుపత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వార్డు నంబర్ 4లోని బెడ్‌పై… ఏళ్లుగా అరుణ అనుభవిస్తున్న బాధ ఎందరినో కలచివేసింది. వారిలో ఆమె స్నేహితురాలు, జర్నలిస్టు పింకి విరానీ ఒకరు. సంవత్సరాల తరబడి పడుతున్న బాధ నుంచి విముక్తి చేస్తూ అరుణను కారుణ్య మరణం కింద చంపేసేందుకు అనుమతించాలంటూ ఆమె 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఐతే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు అలాగే జీవచ్ఛవంలా గడిపిన ఆమె.. 2015లో న్యుమోనియాతో చనిపోయింది. కోల్‌కతా డాక్టర్ కేసు విచారణలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తి షాన్‌బాగ్‌ ఘటన గురించి ప్రస్తావించడంతో.. ఆ దారుణం గురించి మళ్లీ చర్చ మొదలైంది.