Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలకమైన కసరత్తులు పూర్తి చేస్తోంది. లోక్‌సభతోపాటు వివిధ రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ సిద్ధంగా ఉంది.
BRS-BJP: రేవంత్ నెత్తిన బాంబ్.. ఆ కేసుతో రేవంత్‌కు షాక్ ! బీజేపీ, బీఆర్ఎస్ మాస్టర్ స్ట్రోక్
ఇప్పటికే ఈసీ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక అధికారులతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో భద్రత, సిబ్బంది, ఇతర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక పోలీసు ఉన్నతాధికారులు, ఇతర విభాగాల ప్రభుత్వ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశాలు నిర్వహించారు. అన్నింటిపై స్పష్టత వచ్చిన అనంతరం.. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో మార్చి 10న షెడ్యూల్ విడుదలైంది. ఆ సమయంలో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు, ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి కూడా ఏప్రిల్, మేలోనే ఎన్నికలు జరుగుతాయి. మే చివరి వారంకల్లా ఫలితాలు వెలువడుతాయి.
షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈసారి లోక్‌సభతోపాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. అలాగే జమ్ము కాశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తోంది. అక్కడి భద్రతా పరిస్థితులు వంటి అంశాలపై చర్చలు జరిపిన తర్వాత జమ్ము కాశ్మీర్ ఎన్నికలపై స్పష్టత రావొచ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు మరో మూడు వారాలే గడువున్న నేపథ్యంలో పార్టీలన్నీ ముందుగానే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.