Naresh Goyal : బతకడం కంటే జైల్లో చనిపోవడమే మేలు: కన్నీళ్ళు పెట్టుకున్న నరేశ్ గోయల్

జీవితంపై ప్రతి ఆశనూ కోల్పోయా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకడటం కంటే జైలులో చనిపోవడమే మంచిదేమో’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఫౌండర్ నరేశ్‌ గోయల్‌ ప్రత్యేక కోర్టులో కన్నీళ్ళు పెట్టుకున్నారు. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు.

  • Written By:
  • Updated On - January 7, 2024 / 10:05 PM IST

జీవితంపై ఆశలు కోల్పాయననీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో బతకడం కంటే జైల్లో చనిపోవడమే మంచిదేమో అని కన్నీళ్ళు పెట్టుకున్నారు జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) ఫౌండర్ నరేశ్‌ గోయల్‌. కెనరా బ్యాంక్‌లో (Canara Bank) రూ.538 కోట్ల మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం ముంబై ఆర్థర్‌ రోడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

తన భార్య అనిత తనకు దూరంగా ఉండటం బాధిస్తోందన్నారు నరేష్ గోయల్ (Naresh Goyal). ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగోలేదని, క్యాన్సర్‌ చివరి దశలో చావు బతుకుల మధ్య ఉందని కోర్టుకు తెలిపారు. ఎన్ఫోర్స్ మెంట్ (ఈడీ) అధికారులు నరేష్ గోయల్ ను 2023 సెప్టెంబరు 1న అరెస్టు చేసింది. కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయనకు కూడా సంబంధం ఉందని ఈడీ (ED) వాదించింది. ముంబైలో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే ఎదుట నరేష్ గోయల్ బెయిల్‌ కోసం అప్లయ్ చేశారు.

నరేష్ గోయల్ ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. తన వ్యక్తిగత వాదనలు వినాలని ఆయన న్యాయమూర్తిని కోరారు. అందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. దాంతో నరేష్ గోయల్ కన్నీళ్ళు పెట్టుకుంటూ… రెండు చేతులూ జోడించి తన ఆవేదనను న్యాయమూర్తి ముందు చెప్పుకున్నారు. న్యాయస్థానం దగ్గర రోజు వారీగా వాదనల్ని నమోదు చేసే రికార్డుల్లో నరేష్ గోయల్ శరీరంలో ప్రకంపనలు వస్తున్నాయనీ… ఆరోగ్యం బాగోలేదని కూడా నమోదు చేశారు. తన భార్యతో పాటు కుమార్తె ఆరోగ్యం కూడా సరిగా లేదని న్యాయమూర్తికి తెలిపారు. తనకి సాయం చేయడంలో జైలు సిబ్బందికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని తెలిపారు.

‘నేను ఆయన మాటలు ఓపికగా విన్నా. మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని గమనించా. ఆయన శరీరంలో ప్రకంపనలు చూశాను. ఆయన నిలబడటానికి కూడా సాయం కావాల్సి వస్తోంది అని న్యాయమూర్తి తెలిపారు. మోకాళ్లలో నొప్పి, వాపు ఉండటంతో వాటిని ముడవలేకపోతున్నానని గోయల్‌ న్యాయమూర్తికి తెలిపారు. మూత్రానికి వెళుతుంటే నొప్పిగా ఉంటోంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు నరేష్ గోయల్. తాను ఎంతో బలహీనమయ్యానని, జేజే హాస్పిటల్‌కు పంపించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అక్కడ రోగులతో హాస్పిటల్ కిటకిటలాడుతోంది. క్యూ లైన్‌లో వేచి చూసే ఓపిక కూడా ఉండట్లేదు. డాక్టర్లను టైమ్ కి కలిసే పరిస్థితి లేక, ఫాలోఅప్‌లు కూడా వీలు కావడటం లేదు. ఈ పరిస్థితులు తన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని న్యాయమూర్తికి తెలిపారు నరేష్ గోయల్. జేజే హాస్పిటల్‌కు పంపే బదులు జైల్లో చనిపోయేందుకు అనుమతివ్వాలని వేడుకున్నారు. కోర్టుకి వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యేందుకు కూడా శరీరం సహకరించడం లేదన్నారు నరేష్ గోయల్. ఫిజికల్ హాజరు అవడం నుంచి మినహాయించాలని కోరారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సరైన చర్యలు తీసుకోవాలని ఆయన లాయర్లకు కోర్టు ఆదేశాలిచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.జి దేశ్ పాండే తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.