Patanjali: పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్టాక్ మార్కెట్లో పతంజలి షేర్లు పతనం

కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలా ప్రకటనలు చేయడంపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.

  • Written By:
  • Publish Date - February 28, 2024 / 04:42 PM IST

Patanjali: ప్రముఖ యోగా గురు రామేదేవ్ బాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జబ్బుల్ని తమ ఉత్పత్తులు నయం చేస్తాయంటూ సాగిస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడింది. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఇలా ప్రకటనలు చేయడంపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.

LIQUOR CASE TICKETS: ఏంటీ రాజకీయాలు..? లిక్కర్ కేసులో ఉన్నోళ్ళకే టిక్కెట్లు.. పోటీలు పడుతున్న వైసీపీ,టీడీపీ

ఈ మేరకు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం నోటీసులిచ్చింది. జబ్బులను నయం చేస్తాయంటూ పతంజలి ఉత్పత్తుల గురించి సంస్థ చేసిన ప్రచారం వల్ల దేశం మొత్తం మోసపోయిందని, ఇక ఆ ప్రచారాన్ని ఆపాలని, ఉత్పత్తుల బ్రాండింగ్‌ను నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వివరించింది. పతంజలి సంస్థ.. తమ ఉత్పత్తులు వివిధ రకాల జబ్బుల్ని తగ్గిస్తాయని ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పతంజలి సంస్థ తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించింది. ఈ ప్రకటనలపై రాందేవ్ పై, పతంజలి సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ప్రచార ప్రకటనలు ఇవ్వొద్దని పతంజలిని గత ఏడాది నవంబరు 21న సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రకటనలు ఇవ్వబోమని అప్పట్లో పతంజలి కోర్టుకు తెలిపింది. అయితే, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పతంజలి సంస్థ తిరిగి ప్రకటనలు ఇచ్చింది.

ఈ విషయంలో పతంజలిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఇకపైన ఎలాంటి ప్రచారాలు చేయొద్దని కోర్టు సూచించింది. ఈ విషయంలో సమాధానం ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని పతంజలి సంస్థ కోర్టును కోరింది. దీనికి అంగీకరించిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. మరోవైపు పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. పతంజలి షేర్లు దాదాపు ఐదు శాతంపైగా నష్టపోయాయి.