ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఇప్పుడు రైల్వే లైన్ (Railway Line) కోసం పోరాటం సాగుతోంది. రైల్వే లైన్ కావాలనేది జిల్లా ప్రజల చిరకాల కోరిక. ఇన్నాళ్లపాటు పెద్దగా పోరాటం చేయని వారంతా… ఇప్పుడు మాత్రం పోరు తీవ్రతరం చేశారు. ఏకంగా కమిటీలు సైతం పుట్టుకొచ్చాయి.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక పోరాటం ఆదిలాబాద్‌లో సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను (Cement Corporation of India) రీ ఓపెన్ చేయాలని కొందరు పోరాటం చేశారు. దాన్ని బీఆర్ఎస్ నడిపించిందట. తాజాగా రైల్వే లైన్ కోసం రిలే దీక్షలు ప్రారంభించడంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట. కేవలం ఆదిలాబాద్ పార్లమెంట్ (Adilabad Parliament) సెగ్మెంట్ పరిధిలో ఉద్యమాన్ని విస్తరిస్తున్నారు. ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించారు. రాజకీయంగా అనేక రకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి దాకా ఎవరికీ గుర్తుకురాని రైల్వే లైన్ పోరాటం… సడెన్‌గా ఉధృతం కావడం వెనుక రాజకీయ కోణం దాగుందట. ఎక్కడా అనుమానం రాకుండా కొన్ని పార్టీల సంఘాలను కమిటీలో పెట్టి…తెర వెనక మంత్రాంగం సాగిస్తున్నారట. పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) వస్తుండటంతో… బీజేపీ (BJP) ని దోషిగా నిలబెట్టడం కోసం మిగతా పార్టీలు ఈ స్కెచ్ వేశాయట.
ఇప్పటికే పటాన్‌చెరు (Patancheru) నుంచి ఆదిలాబాద్ వరకు… కష్టపడి రైల్వే లైన్‌ను మంజూరు చేయిస్తే… ఆ క్రెడిట్ ఎక్కడ బీజేపీకి పోతుందోనన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోందట. వాస్తవానికి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్‌ను కేంద్రం ప్రతిపాదించింది. పటాన్ చెరు నుంచి ఆదిలాబాద్‌కు ప్రతిపాదనలు సైతం ఇచ్చారు. సర్వేలు సాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ముచ్చట లేదు. పోరాటం ఊసెత్తని నాయకులు ఇప్పుడే ఎందుకు దీక్షలు చేస్తున్నారు ? ఆయా జిల్లాల్లో పోరాటానికి రూపకల్పన చేయడంతో ఎవరి ప్రోద్బలం ఉందన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఎంపీ ఎన్నికలే లక్ష్యంగా ముందుచూపుతో పోరాటం ప్రారంభించారనే చర్చ నడుస్తోంది. గతంలో బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన… కాంగ్రెస్‌తో పని చేసిన వారే…రైల్వే లైన్ పేరుతో పోరాటంలో ముందున్నారట.
ఇది కేవలం ఎన్నికల స్టంట్‌లో భాగంగానే ప్రారంభించారనీ… ఏది లేకపోతే దీన్ని ముందేసుకోని లబ్ది పొందాలని చూస్తున్నారట. ఫోటోల కోసం ఫోజులివ్వడం, రోజు పేపర్లలో వార్తలు రావడం కోసమే ఇలాంటివి చేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లైన్ ఓకే అయింది.. సర్వే కూడా జరుగుతోంది. ఎందుకు పోరాటం చేస్తున్నట్టు అంటూ బీజేపీ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. రైల్వే లైన్ మంజూరు సరే… పటాన్‌చెరు నుంచి కాకుండా… ఆదిలాబాద్ నుంచి పనులు ప్రారంభించాలనే వాదాన్ని తెస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ప్రారంభించి ఆర్మూర్ వరకు లైన్ వేస్తే చాలనీ… మిగతాది ఎప్పుడు వేసినా పర్లేదు అన్నట్లు మాట్లాడుతున్నారట. ఆదిలాబాద్ టూ ఆర్మూర్ లైన్ ప్రారంభిస్తే… ఆర్మూర్‌లో ఇప్పటికే లైన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎక్కడికైనా రైల్లో వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా… తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే లైన్ పూర్తి అయిపోతుందనేది రైల్వే లైన్ సాధన కమిటి వాదన. పనులు ప్రారంభించడం సర్వేలు లేదా బడ్జెట్ ఇవ్వడం అనేదే తర్వాత ముచ్చట. రాని సగం లైన్ కోసం పోరాటం చేయడంలో రాజకీయ కుట్ర దాగుందనేది బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ ఎంపీని బద్నాం చేయడం కోసం సొంత పార్టీలోని కొందరు నాయకులు పోరాటం చేయాలని ఉప్పందించారట. పోరాటానికి లెప్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు తెలపడంలో… బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడమేనట. రాజకీయ నాయకుల ఎత్తులతోనే పోరాటం జరుగుతోందని ఎంపీ సోయం బాపురావు భావిస్తున్నారు. దీక్షల వెనక ఏ పార్టీ ఉంది. ఎవరి స్వలాభం కోసం ఉద్యమం ప్రారంభించారు ? అది నెరవేరే లక్ష్యమేనా ? ఈ పోరాటం ఎంపీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యం సాధిస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.