Alla Ramakrishna Reddy : జగన్ ద్రోహాన్ని ఆర్కే తట్టుకోలేకపోయాడా ?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతో లోకల్‌ గ్రూప్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా తెర మీదికి వచ్చాయి. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళకు సొంత పార్టీ నాయకులే చెక్ పెట్టారా? లేక రాబోయే పరిస్థితిని ఊహించి ఆయనే తెలివిగా నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. తాజాగా నియోజకవర్గంలో వెలిసిన రెండో వైసీపీ కార్యాలయమే ఎమ్మెల్యే రాజీనామాకు కారణం అయిందన్న ప్రచారం కూడా ఉంది.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతో లోకల్‌ గ్రూప్‌ పాలిటిక్స్‌ ఒక్కసారిగా తెర మీదికి వచ్చాయి. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళకు సొంత పార్టీ నాయకులే చెక్ పెట్టారా? లేక రాబోయే పరిస్థితిని ఊహించి ఆయనే తెలివిగా నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. తాజాగా నియోజకవర్గంలో వెలిసిన రెండో వైసీపీ కార్యాలయమే ఎమ్మెల్యే రాజీనామాకు కారణం అయిందన్న ప్రచారం కూడా ఉంది. అలాగే.. 2019 ఎన్నికల్లో గెలిచాక ఆర్కే పార్టీ కేడర్‌కు సైతం ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నారన్న చర్చ కూడా మొదలైంది. పార్టీ వ్యవహారాల నుంచి ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట వైసీపీ వర్గాల్లో. తన నియోజకవర్గానికి సరైన నిధులు ఇవ్వట్లేదనీ, తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి వేరే ఎవరికో ఇచ్చారని ఆర్కే తీవ్ర అసహనంగా ఉన్నట్టు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అదే విషయాన్ని తరచూ తన అనుచరుల దగ్గర చెబుతూ వస్తున్నారట ఆయన.

ఈ లోపుగా బీసీ సామాజిక వర్గానికి మంగళగిరి సీటు కేటాయించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉందని తెలుసుకొని ముందు జాగ్రత్త పడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే తాను ఎమ్మెల్యేగా ఉండగానే, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో తనకు ఎదురయ్యే ఇబ్బందులు, ఒకవేళ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో సీటు ఇచ్చినా ఎదురయ్యే సమస్యలను ముందే ఊహించుకుని ఆయన అడుగులు రాజీనామా వైపు పడ్డాయన్న విశ్లేషణలున్నాయి. గడిచిన రెండు విడతల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్కే , మంత్రివర్గంలో చోటు కోసం బోలెడు ఆశలు పెట్టుకున్నారు.. కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా అధిష్టానం వేరే ఎవరికో మంత్రి పదవి ఇచ్చిందన్న బాధ ఆయనలో గూడు కట్టుకు పోయిందట. ఈక్రమంలోనే అప్పుడప్పుడు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి రావడం, వాట్సాప్‌ డీపీలో ఆమె ఫోటోలు పెట్టడం లాంటి పనులు చేసి అధిష్టానానికి కోపం తెప్పించారని కూడా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కానీ అవేమీ బయట పెట్టకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆర్కే.

మున్సిపల్ మాజీ ఛైర్మన్‌ గంజి చిరంజీవి.. బీసీ నాయకుల్ని తన వైపు రాకుండా అడ్డుకుంటున్నారనీ.. 2014 లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం నచ్చలేదని అంటున్నారట సన్నిహితులు. బీసీ ఓటర్ల నియోజకవర్గంగా ఉన్న మంగళగిరిని బీసీ అభ్యర్థి కేటాయిస్తే ఇక తాను రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆర్కే భావించి ఉండవచ్చన్న వాదన వినిపిస్తోంది. 1995 నుంయి రాజకీయాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే ఆర్కే.. ఎప్పుడు నెగ్గాలో కాదు, ఎటువైపు మొగ్గాలో బాగా తెలిసిన వ్యక్తి అంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ పరిస్థితుల్లో తాజా రాజీనామా పరిణామాలు ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. కేవలం ఎమ్మెల్యే పదవికే గాక పార్టీకి కూడా రాజీనామా చేయడంతో ముందు ముందు ఆయన అడుగులు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. పార్టీ మారతారా లేక రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.