Board Exams: జాతీయ విద్యా విధానం.. ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ పరీక్షలు

2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త అకడమిక్ విధానం అమలవుతుంది. ఇందులో భాగంగా పది, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. రెండింట్లో ఎక్కువగా వచ్చిన స్కోరును విద్యార్థులు ఎంచుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 06:57 PM IST

Board Exams: కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. ఇకపై టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షల్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు.

REVANTH REDDY: ఏపీలో రేవంత్‌ రెడ్డి ప్రచారం.. మరి చంద్రబాబును తిడతారా?

దీని ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త అకడమిక్ విధానం అమలవుతుంది. ఇందులో భాగంగా పది, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. రెండింట్లో ఎక్కువగా వచ్చిన స్కోరును విద్యార్థులు ఎంచుకోవచ్చు. అంటే మొదటిసారి తక్కువ స్కోరు వచ్చినప్పుడు.. రెండోసారి ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. ఒకవేళ రెండోసారి తక్కువ స్కోర్ వస్తే.. మొదటి స్కోరునే ఎంచుకోవచ్చు. ఇంటర్ విద్యార్థులు రెండు లాంగ్వేజెస్ కచ్చితంగా చదవాలి. అందులో ఒకటి భారతీయ భాష అయి ఉండాలి. విద్యార్థులు ఒకే ఏడాది రెండుసార్లు పరీక్షలు రాయాలి. దీనివల్ల విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుందని, ఒత్తిడి లేని విద్యా విధానమే తమ లక్ష్యమని కేంద్రం తెలిపింది. ఈ విధానం దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చేందుకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.

పాఠశాల విద్యకు సంబంధించి గత ఏడాది ఆగష్టులో కొత్త కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను కేంద్ర విద్యాశాఖ రూపొందించింది. దీని ప్రకారమే రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించబోతున్నారు. రెండుసార్లు అవకాశం ఉంటుంది కాబట్టి.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. విద్యార్థులు మెరుగైన పనితీరు కనబర్చే వీలుంది. అయితే, ఈ పరీక్షలు సిలబస్ మొత్తానికి ఒకేసారి నిర్వహిస్తారా.. లేక సెమిస్టర్ పద్ధతిలో నిర్వహిస్తారా.. అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.