Supreme Court: ఎంపీలు (MP’s), ఎమ్మెల్యేల (MLAs)పై నమోదైన క్రిమినల్ కేసులను త్వరగా విచారించే అంశంపై భారత సుప్రీంకోర్టు (Supreme Court) కీలక సూచనలు చేసింది. ఈ కేసుల విచారణ ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల విచారణ త్వరగా పూర్తయ్యేలా.. హైకోర్టులో స్పెషల్ బెంచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కేసుల విచారణను నిరంతరం ప్రత్యేక బెంచ్‌లు పర్యవేక్షించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై విచారణలు వేగవంతం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ, విజయ్ హన్సారియా సహా పలువురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
అలాంటి ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్న వాళ్లు 40 శాతం మంది ఉన్నారని కోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణలో ఉమ్మడి మార్గదర్శకాలు విడుదల చేయలేమని అభిప్రాయపడింది. ఈ కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను వేగంగా విచారించాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ఈ బెంచ్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తూ, ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలని సూచించింది. దాఖలు చేసిన సంవత్సరం, పెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ కేసుల సంఖ్య, విచారణల దశ గురించి జిల్లా వారీగా సమాచారాన్ని అందించే వెబ్‌సైట్‌ను రూపొందించాలి.
Ponguleti Srinivas Reddy : పొంగులేటిపై ఐటీ రెయిడ్స్.. రెండు రోజుల ముందే లీక్..?
తీవ్రమైన నేరం కేసులో దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించే అంశంపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 227 ప్రకారం జిల్లాల న్యాయవ్యవస్థపై హైకోర్టులకు ఇప్పటికే పర్యవేక్షణ అధికారం ఉన్నందున ప్రతి కేసు స్థితిని సులభంగా పర్యవేక్షించగలదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి తమ పరిధిలో ఉన్న ఇలాంటి వ్యవహారాలపై సుమోటో కేసులు నమోదు చేయాలని కూడా జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు. కోర్టులు ఈ కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం శిక్షపడే కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.