పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించింది. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. NPS వాత్సల్య పథకం సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం గురించి కూడా ప్రకటన చేశారు. ఎన్‌పీఎస్ వాత్సల్య అనేది.. తమ పిల్లల కోసం చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టే పథకం. ఇక్కడ దీర్ఘకాలంలో అదిరిపోయే రిటర్న్స్ వస్తాయి. కాంపౌండింగ్ ఎఫెక్ట్.. అంటే చక్రవడ్డీ కారణంగా పెట్టుబడికి ఎన్నో రెట్లు రిటర్న్స్ అందుకోవచ్చు. దీంట్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత.. రిటైర్మెంట్ అనంతరం.. ఎన్‌పీఎస్ నిధి నుంచి ఒకేసారి 60 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు.
ఇక మిగతా 40 శాతం మొత్తంతో యాన్యుటీ పథకాల్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బులు పొందొచ్చు. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరిట.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ వాత్సల్య అకౌంట్ తీసుకోవచ్చు. కనీసం ఏడాదికి వెయ్యి రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం e-Nps లో ఈ స్కీ్మ్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. గార్డియెన్ లేదా పేరెంట్ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ అవసరం పడుతుంది. మైనర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి.
ఇది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎన్‌పీఎస్ వాత్సల్యగా ఉంటుంది. అదే పిల్లలు మేజర్లు అయిన తర్వాత.. సాధారణ NPS అకౌంట్‌గా కొనసాగుతుంది. ఇక ఈ అకౌంట్ ఆ తర్వాతా కొనసాగించొచ్చు. రిటైర్మెంట్ వయసు వరకు ఇందులో పెట్టుబడులు పెడితే లాంగ్ రన్‌లో మంచి ఆదాయం సమకూరుతుంది. ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దేశ ప్రజలు అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం 2004లో ఎన్‌పీఎస్ పథకం లాంఛ్ చేసింది. ఇక్కడ మంచి పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం- సెక్షన్ 80c కింద గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో ఇందులో పెట్టుబడులపై 2 లక్షల వరకు టాక్స్ తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా మంచి ప్రాచుర్యం పొందిన ఈ స్కీంను ఇప్పుడు మరింత విస్తృతం చేస్తూ.. చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. చాలా చిన్న వయసు నుంచే ఈ పథకంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుంది. ఇందులో చక్రవడ్డీ ప్రయోజనం పొందొచ్చు. అంటే.. ఏటా సంపద పెరుగుతూ పోతూనే ఉంటుంది. మైనర్లుగా ఉన్నప్పుడే.. ఈ వాత్సల్య పథకం తెరవడం వల్ల.. పదవీ విరమణ నాటికి.. చాలా పెద్ద మొత్తంలో నిధి సమకూరుతుంది.