బ్రిటీష్ కాలం నాటి చట్టాలను మారుస్తూ భారతీయ చట్టాలను తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో హిట్ రన్ కేసుకు సంబంధించి శిక్షా కాలం పెంచడంపై డ్రైవర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదాలు చేసి… పారిపోవడాన్ని హిట్ అండ్ రన్ అంటారు. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాల్లో ఇవి దాదాపు పదోవంతు ఉంటున్నాయి. హత్యకేసుల్లో మరణాల కంటే కూడా ఇవే ఎక్కువ. యాక్సిడెంట్ చేసిన తర్వాత బాధితులను పట్టించుకోకుండా డ్రైవర్లు తమ వాహనాలతో పరార్ అవడమో లేదంటే వెహికిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోవడమో చేస్తున్నారు. బాధితులను సరైన టైమ్ లో హాస్పిటల్ కి తీసుకెళ్ళి చికిత్స అందించగలిగితే… ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య తగ్గుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలు ఎక్కువగా ఉంటే… ఇలాంటి ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గుతుందని భావించింది.
ప్రస్తుతం కొత్తగా వస్తున్న భారత న్యాయ సంహితలోని 104 సెక్షన్ లో హిట్ అండ్ రన్ కు సంబంధించి రెండు క్లాజులు ఉన్నాయి. డ్రైవర్ ఏదైనా ప్రమాదానికి కారణమైతే… గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తీసుకెళ్ళడం, ఒకవేళ మరణిస్తే … జనం పట్టుకొని కొడతారన్న భయం ఉన్నప్పుడు… కనీసం పోలీసులు లేదా మెజిస్ట్రేట్ కు సమాచారం అందించడం లేదంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే నిందితుడికి ఐదేళ్ళ లోపు జైలు శిక్ష పడుతుంది. ఈ సెక్షన్ బెయిలబుల్ కూడా. అలా కాకుండా … ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పరార్ అయితే అందుకు వేరే విధంగా శిక్షలు ఉన్నాయి. పారిపోయిన డ్రైవర్ ను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తే… గరిష్టంగా వాళ్ళకు 10యేళ్ల దాకా శిక్ష పడుతుంది. లేదా జైలుశిక్షతో పాటు 7 లక్ష రూపాయల దాకా జరిమానా విధిస్తారు. ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్. గతంలో ఐపీసీలో ఈ శిక్ష గరిష్టంగా రెండేళ్ళు, జరిమానా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు BNS లో పదేళ్ళకు పెంచడంపై డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.
గతంలో లాగే ఒకటి లేదా 2యేళ్ళకు శిక్షను తగ్గించాలని పెట్రోల్ ట్యాంకర్ డ్రైవర్లు, ట్రక్కు డ్రైవర్లు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్ ల డ్రైవర్లు కోరుతున్నారు. పదేళ్ళ జైలు, 7 లక్షల జరిమానా విధిస్తే… తమ కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అన్నేళ్ళు తాము జైల్లో ఉంటే…భార్యా పిల్లలు రోడ్డున పడతారని వాపోతున్నారు. BNS చట్టాన్ని అమలు చేయొద్దంటూ… ఒక్కసారి పెట్రోల్ ట్యాంకర్లు, ట్రక్కులను డ్రైవర్లు నిలిపివేయడంతో… పెట్రోల్ కోసం జనం బంకుల దగ్గర క్యూలు కట్టారు. దాంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించింది. BNS చట్టంలో ప్రతిపాదనలు మాత్రమేననీ… దానిపై ఫైనల్ గా యాక్ట్ చేసేముందు డ్రైవర్ల యూనియన్లతో చర్చిస్తామని హామీ ఇచ్చింది. దాంతో పెట్రోల్ ట్యాంకర్లు, ట్రక్కుల డ్రైవర్లు ఆందోళన విరమించారు.